Sri Lanka MP Beaten To Death : భారీ ఆర్థిక సంక్షోభం మధ్య మే 9న శ్రీలంకలో హింస పెద్ద ఎత్తున జరిగింది. ప్రభుత్వ మద్దతుదారులు మరియు ప్రత్యర్థుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా చెలరేగడంతో కనీసం 5 మంది మరణించారు.
ఈ ఘర్షణలో దాదాపు 200 మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో అధికార పార్టీ ఎంపీ కూడా ఉన్నారు. పరిస్థితి మరీ దారుణంగా తయారై పరిపాలన యంత్రాంగం కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది.
మే 9న, ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల బృందం హంబన్టోటాలోని రాజపక్స పూర్వీకుల నివాసాన్ని తగులబెట్టింది.
అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం తెరిచేందుకే రాజీనామా చేస్తున్నట్టు మహింద తన రాజీనామాలో పేర్కొన్నారు. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని చెప్పారు.
ప్రధాని రాజీనామాతో మంత్రివర్గం కూడా రద్దయింది. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మధ్యంతర పరిపాలనను ఏర్పాటు చేయమని మహింద తమ్ముడు మరియు అధ్యక్షుడు గోటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కొంతకాలంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.
మహింద రాజపక్సే మద్దతుదారులు ప్రదర్శనకారులపై దాడి చేయడంతో దేశవ్యాప్తంగా హింస చెలరేగిందని నిరసనకారులు ఆరోపించారు. రాజధాని కొలంబో నుంచి తిరిగి వస్తున్న రాజపక్సే మద్దతుదారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనేక నగరాల్లో వారి వాహనాలను ఆపి వారిపై దాడి చేశారు. ఈ హింస తర్వాత, ప్రతిపక్ష పార్టీలు కూడా మహిందను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ప్రధానంగా విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా సంక్షోభం తలెత్తింది, దీని కారణంగా ప్రధానమైన ఆహార పదార్థాలు మరియు ఇంధనాల దిగుమతుల కోసం దేశం డబ్బులు చెల్లించలేకపోయింది.
దిగుమతుల కోసం ప్రభుత్వం నిధుల కొరతతో ఏప్రిల్ 9 నుండి వేలాది మంది నిరసనకారులు శ్రీలంక వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.
0 Comments:
Post a Comment