Snake island : మొత్తం కలిపి 0.17 కిలోమీటర్లు. పొడవు అరకిలోమీటర్ కంటే కాస్త ఎక్కువ. వెడల్పు అర కిలోమీటర్ కంటే తక్కువ. స్కేల్ పెట్టి కొల్చేంత వీలున్న ద్వీపమది.
అత్యధిక శాతం రాతిమయం. పేరు స్నేక్ ఐలాండ్. ఇప్పుడు అదే రష్యా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుసలు కొడుతూ..రష్యాను వెంటాడుతోంది. వేల ఏళ్ల చరిత్ర వున్న ఆ చిన్న దీవి..ఇప్పుడు రష్యాకు పక్కలో బల్లెంలా మారింది.
దాని జోలికి ఎందుకు పోయామా అని పుతిన్ సైన్యం ఇప్పుడు తలపట్టుకుంది. వరుసగా యుద్ధ నౌకల ధ్వంసం రష్యాకు పీడకలగా మారుతోంది.
యుద్ధం మొదలైన రోజే…రష్యా సైనం…మాస్కోవా యుద్ధ నౌక సాయంతో స్కేక్ ఐలాండ్‌ను రౌండప్ చేసింది. అక్కడున్న యుక్రెయిన్ సైన్యాన్ని పట్టుకుంది. నిజానికి రష్యా పండుగ జరుపుకోవాల్సిన సమయమది.
దానికి కారణం కూడా లేకపోలేదు. మొత్తం కొలిచినా పావు కిలో మీటర్ కూడా లేని స్నేక్ ఐలాండ్…బ్లాక్ సీ లో అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రదేశం. సముద్ర మట్టానికి కేవలం 135 అడుగుల ఎత్తులో వున్నా దాని ప్రత్యేకత వేరు. యుక్రెయిన్ ఆర్థిక కేంద్రమైన ఒడెస్సా పోర్టుకు 80 కిలోమీటర్ల దూరంలో ఆ ద్వీపంపై పట్టు సాధించిన దేశానికి…బ్లాక్ సీలో నౌకల కదలికలపై నిఘా పెట్టడం చాలా సులువు అవుతుంది.
అందుకే యుద్ధం మొదలుపెట్టగానే రష్యా సేనలు ఆ ద్వీపంపై కన్నేశాయి. మాస్కోవా యుద్ధ నౌక…ఆ ద్వీపంపై క్రూజ్ క్షిపణుల వర్షం కురిపించింది కట్టడాలను, లైట్‌హౌస్‌ను కూల్చి వేసింది. అక్కడ ఎలెక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
కానీ స్నేక్ ఐలాండ్‌పై పట్టు సాధించామనే రష్యా ఆనందం…గాల్లో కలిసిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. చిట్టి ద్వీపమే అనుకుంటే చుక్కలు చూపిస్తోంది. రానురాను ఆ దీవి రష్యాకు మృత్యు దీవిగా మారిపోయింది. ఇప్పటిదాకా రష్యాకు చెందిన రెండు భారీ యుద్ధ నౌకలతో సహా మూడు నౌకలు బ్లాక్ సీలో మునిగిపోయాయి.
రష్యా లెక్క చెప్పడంలేదు గానీ చాలా మంది సైనికులు చనిపోయారు. ఏప్రిల్ 13న మాస్కోవా నౌక స్నేక్ ఐలాండ్ సమీపంలో ప్రయాణిస్తుండగా యుక్రెయిన్ క్షిపణులు నౌకను ధ్వంసం చేశాయి. ఆ మర్నాడే దెబ్బతిన్న ఆ నౌకను మరో చోటికి రష్యా తరలిస్తుండగా సముద్రంలో మునిగిపోయింది.
ఈ ఘటన రష్యాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా యుక్రెయిన్ క్షిపణులు రష్యాకే చెందిన మరో యుద్ధ నౌకను ధ్వంసం చేశాయి. అదే ద్వీపం సమీపంలో మరో నౌకను ముంచేసినట్టు వీడియోతో సహా యుక్రెయిన్ లేటెస్ట్‌గా ట్వీట్ చేయడం రష్యా జీర్ణించుకోలేకపోతోంది.
వాస్తవానికి 1991 తర్వాత సోవియట్ పతనంతో స్నేక్ ఐలాండ్ యుక్రెయిన్ చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ పావు కిలోమీటర్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. అయినా అది వ్యూహాత్మక ప్రదేశం కావడంతో దాన్ని వుంచుకోలేక, వదులుకోలేక రష్యా తల బొప్పి కడుతోంది.
0 Comments:
Post a Comment