Savings: ప్రతి నెలా పొదుపు చేయాలా..? ఈ సూత్రాలు పాటించండి..
జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు. కొన్ని సందర్భాల్లో మనల్ని అనేక కష్టాల్లోకి తోసేస్తుంది. అలాంటి సమయంలో మీ వద్ద సరిపడా డబ్బు ఉన్నట్లైతే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే పొదుపు చాలా ముఖ్యం. మరి పొదుపు ఎలా చేయాలి? అందుకు ఉన్న సూత్రాలేమిటో చూద్దాం!
ఆటోమేటిక్ పొదుపు: సొంతంగా డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన నుంచి బయటికి వచ్చి ఆటోమేటిక్ విధానంలో పొదుపు చేయడం ప్రారంభించడం మంచిది. ఇలా చేయడానికి ఒక మార్గం ఉంది. మీరు సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని మీ పొదుపు ఖాతాలోనే ఉంచి, అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా ఏదైనా ఒక రంగంలో పెట్టుబడి పెట్టేలా ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా కొంత కాలానికి పెద్ద మొత్తంలో డబ్బు మీకు చేరుతుంది. ఇలా కాకుండా మీరే సొంతంగా డబ్బు దాచుకోవాలని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందలేరు. ఏదో ఒక అవసరానికి వాటిని వినియోగిస్తారు. అందుకే ఆటోమేటిక్ విధానం ద్వారా డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించండి.
ఆటోమేటిక్ పొదుపునకు ఇదీ ఉదాహరణ: ఆరు నెలల క్రితం సునీత అనే మహిళ రికరింగ్ డిపాజిట్‌ను ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం ఒక సంవత్సరం పాటు నెలకు రూ.15వేలు చొప్పున ఆమె ఖాతాలో డబ్బు ఆటోమేటిక్‌గా డిడెక్ట్ అయ్యేలా చేసుకున్నారు. 8 నెలల తర్వాత సునీత ఖాతాలో రూ.1.20 లక్షలు ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసేసరికి ఆమె ఆనందంలో మునిగిపోయింది. దీనికి కారణం ఆటోమేటిక్ సేవింగ్. ఆమె నెలవారీ ఖర్చులు, షాపింగ్, బిల్లులు మిగిలిన జీతం నుంచి చెల్లించేది. అలాగే ఆమె ఖర్చులన్నింటినీ మిగిలిన జీతంతోనే సర్దుబాటు చేసుకోవడం వల్ల ఆమె ఖాతాలో అంత మొత్తం పొదుపైంది.
డబ్బు ఓ నీటి ప్రవాహం: తగినంత డబ్బు మీరు ఎందుకు ఆదా చేయలేకపోతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి సంవత్సరం మీ జీతం పెరుగుతున్నప్పటికీ మీ అవసరాలు కూడా దానికి తగట్టు పెరుగుతున్నాయి. అందుకే మీరు కొంత డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ... పెరిగిన జీతానికి తగినంత పొదుపు చేయలేకపోతున్నారు. డబ్బనేది ప్రవహించే నీరులాంటిది. మీరు దానికి ఒక దిశ చూపకపోతే, అది దాని సొంత దిశలో పయనిస్తుంది. అందుకే మీరు డబ్బును ఆటోమేటిక్ పద్ధతిలో ఆదా చేయకపోతే అప్పుడు మొత్తం డబ్బు ఏదోరకంగా ఖర్చయిపోతుంది. జీవితం మిమల్ని అనేక రకాల ఖర్చులు, అవసరాలు, కోరికల్లోకి నెట్టేస్తుంది.
రాబడి - ఖర్చులు - ఆదా: పెట్టుబడిదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ‘‘ఆదాయం - ఖర్చులు = పొదుపు’’ అనే సూత్రాన్ని ఆచరిస్తారు. ఈ సూత్రం సహజమైనది. అలాగే లాజిక్‌తో కూడుకున్నది. మొదట మీకు వచ్చిన ఆదాయంలో ఖర్చులు తీయగా.. మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. కానీ అది తప్పు. మొదట కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుని మిగిలిన మొత్తాన్ని మీ నెల ఖర్చులకు వినియోగించుకోవాలి. ఒకవేళ మీరు నెల నెలా కొంత మొత్తాన్ని ఆదా చేసుకోకపోతే పైన తెలిపిన సూత్రం మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. ప్రతి నెలా కొంత మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా చూసుకోండి. అలా ప్రతి నెలా చేసినట్లయితే కొంత కాలానికి మీ బ్యాంకు ఖాతాలో ఎక్కువ మొత్తంలో డబ్బు చేరుతుంది. అప్పుడు ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటే మంచిది. ఈ విధంగా ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆదా చేసుకున్నట్లైతే మీ పొదుపు ఖాతాలో ఉన్న డబ్బుతో మీ భార్య, పిల్లల అవసరాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్చొచ్చు
వీటిని అమలు చేయండి..
* ప్రతి నెలా మీరు కనీసం ఎంత మొత్తంలో పొదుపు చేయాలో నిర్ణయించుకోండి. అది 10 శాతం, 20 శాతం, 30 శాతం ఎంతైనా కావచ్చు. మొదట మీరు చిన్న మొత్తంతో పొదుపు ప్రారంభించి తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్లొచ్చు.
* ఒకవేళ మీ నెల జీతం 2వ తేదీన మీ పొదుపు ఖాతాలో జమ అవుతుందనుకుంటే అప్పుడు మీ సిప్, రికరింగ్ డిపాజిట్ తేదీలను 4వ తేదీన గానీ, 5 వ తేదీన గానీ డెబిట్ అయ్యేలా ఏర్పాటు చేసుకోండి.
* ఆటోమేషన్ ద్వారా పొదుపు చేసుకోండి. అది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనట్లయితే వీటిని ఉపయోగించుకోవచ్చు.
0 Comments:
Post a Comment