స్టాక్ మార్కోట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆశక్తి చూపే చాలామంది తమ డీమ్యాట్ ఖాతాకు నామినీని జతచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వరు.
ఆన్‌లైన్ లేదా ఆన్‌లైన్ పెట్టుబడి ఫారం నింపేటప్పుడు నామినికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగానే వదిలేస్తుంటారు.
లేదా నామమాత్రంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు రాస్తారు కానీ సమయానుకూలంగా అప్‌డేట్ చేయటం మర్చిపోతుంటారు అయితే ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
నామినీని ఎందుకు నియమించాలి?
డీమ్యాట్ ఖాతా పెట్టుబడిదారుడు మరణిస్తే, అతని ఖాతాలోని షేర్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టబద్ధమైన వారసులకు అందించడంలో నామినీ సహాయపడతారు. ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి.
నామినీ, చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు చట్టబద్ధమైన వారసులకు చేర్చడంలో నామినీ వారిధిగా వ్యవహరిస్తారు. అందువల్ల నామినీగా సొంతవారినే నియమించాల్సి అవసరం లేదు.
బయటి వ్యక్తులను నియమించుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు చట్టబద్ధమైన వారసులనే నామినీలుగా నియమించడం మంచిదని నిపుణులు చెబుతుంటారు.
నామినీ లేకపోతే..
ఒకవేళ పెట్టుబడిదారుడు నామినీని నియమించకుండానే మరణిస్తే, షేర్ల బదిలీ సమయంలో ఆధారిత కుటుంబ సభ్యులు బదిలీ కోసం కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతీ సెక్యూరిటీకి సంబంధించిన, అవసరమైన అన్ని పత్రాలతో పాటు, బదిలీ కోసం ప్రతేక దరఖాస్తును సమర్పించాలి.
మరణించిన వ్యక్తి చట్టబద్ధమైన వారసులుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడిదారుడు రాసిన వీలునామా గానీ, వారసత్వ ధృవీకరణ పత్రం గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతో పాటు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.
ఏం చేయాలి?
ముందుగా మీ డీమ్యాట్ ఖాతాకు నామినీని జత చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మీ డీమ్యాట్ ఖాతా క్లయింట్ మాస్టర్ రిపోర్ట్ లేదా ఖాతా స్టేట్‌మెంటును చెక్‌చేయవచ్చు. ఒకవేళ ఇప్పటికే నామినీ వివరాలు ఇచ్చి వుంటే పర్వాలేదు.
ఒకవేళ ఇవ్వకపోయినా, నామినీని అప్‌డేట్ చేయాలనుకున్నా.. నామినేషన్ ఫారంను పూర్తి చేసి మీ డిపాజిటరీ పార్టిసిపెంట్(డిపి)కి సమర్పించాల్సి ఉంటుంది.
నామినీగా ఎవరిని జత చేయవచ్చు?
డీ మ్యాట్ ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా నిర్వహించినా నామినీని జత చేయవచ్చు. అయితే ఖాతాదారునికి మాత్రమే నామినీని ఏర్పాటు చేసే హక్కు ఉంటుంది. పవర్ ఆఫ్ అటార్ని హోల్డర్‌కి హక్కు ఉండదు.
* నామినీగా సొంత కుటుంబ సభ్యులు ( భార్య, పిల్లలు, తల్లిదండ్రలు, తోబుట్టువులు) లేదా బయటి వ్యక్తులైనా నియమించవచ్చు.
* మైనర్, ఎన్ఆర్ఐ, పవర్ ఆఫ్ అటార్ని హోల్డర్‌ని నామినీగా నియమించవచ్చు.
* నామినీ ఎప్పుడైనా యాడ్ చేయవచ్చు. అలాగే మార్చవచ్చు.
* డీ మ్యాట్ ఖాతాకు ఒక్కరు లేదా గరిష్టంగా ముగ్గురు నామినీలను జతచేయవచ్చు.
* నామినీగా నియమించే వ్యక్తికి డీమ్యాట్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు.
* ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు మార్గాల ద్వారా నామినీని నియమించవచ్చు.
చివరిగా..
ఒక్క డీమ్యాట్ ఖాతాకే కాదు. బ్యాంకు ఖాతా, జీవిత బీమా పాలసీలు, ఈపీఎఫ్, ఇతర పెట్టుబడులకు నామినీని జతచేయడం తప్పనిసరి.
అప్పుడే మీ పెట్టుబడులు మీపై ఆధారపడిన సభ్యులకు ఎటువంటి ఆలస్యం లేకుండా చేరతాయి.
0 Comments:
Post a Comment