Kolanu Bharati - ఆంధ్రప్రదేశ్ లోనే ఏకైక సరస్వతీ ఆలయం..
రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీ ఆలయంగా కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రం విరాజిల్లుతోంది. నిజానికి దేశం లోనే సరస్వతీ అమ్మవారి ప్రాచీన ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి.
వీటిలో జమ్ముకాశ్మీర్ లోని శారదపీఠం వద్ద వెలసిన సరస్వతీ క్షేత్రానికి మొదటిదిగా చెప్పవచ్చు. రెండో ఆలయంగా తెలంగాణ లోని అదిలాబాద్ జిల్లాలోని బాసర క్షేత్రం విరాజిల్లుతుండగా, మూడో క్షేత్రంగా కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలం నల్లమల అడవుల్లో కొలనుభారతి క్షేత్రం కొలువుతీరింది.
ఈ క్షేత్రంలో అమ్మవారు నాలుగు కరములు(చేతులు) కలిగి ఉత్తరముఖంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించి కుడి రెండు చేతుల్లో పాశం, అభయహస్తాన్ని కలిగివుండును. అదేవిధంగా ఎడమవైపు రెండు చేతుల్లో పుస్తకం, అంకుశం(గొడ్డలి) కలిగి భక్తులకు దర్శనమిస్తారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం, బీజాక్షర క్రతువులను చేపట్టేందుకు భక్తులు విశేషంగా తరలివస్తారు. ప్రతిఏటా మాఘశుద్ద పంచమి రోజున అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే వసంతపంచమి వేడుకలు ఈ క్షేత్రంలో వైభవంగా జరుగుతాయి.
ఈ క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర ఓడిసా, కర్నాటక, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తూ.. అమ్మవారిని దర్శించుకుంటారు. సప్తనదుల సంగమక్షేత్రమైన శ్రీలలితా సంగమేశ్వరక్షేత్రానికి వచ్చే భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో కొలనుభారతి క్షేత్రాన్ని దర్శించుకుంటారు.
దేశం లోనే ప్రసిద్దిగాంచిన సరస్వతీ క్షేత్రం
కొలనుభారతి క్షేత్రం దేశం లోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది. కర్నూలు జిల్లా, కొత్తపల్లి మండలం లోని నల్లమల పర్వత సానుల నడుమ 11వ శాతాబ్దానికి ముందే ఈ క్షేత్రం ఆవిర్భవించినట్లు ప్రాచీన చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే 11శతాబ్దంలో రెండవ చాళుక్యులరాజుల కాలం నాటికి చెందిన మల్లభూపతిరాజు శిధిలావస్థకు చేరిన అమ్మవారి ఆలయాన్ని జీర్ణోద్దరణ గావించి పున:నిర్మించారు.
అప్పట్లోనే క్షేత్రంలో సప్తరుషులచే సప్తశివాలయాలను కూడా నిర్మించి ఆయా శివాలయాల్లో శివలింగాలను ప్రతిష్టించారు. అలాగే క్షేత్రంలో సహజసిద్దంగా ఏర్పడిన చారుఘోషిని తీర్థం నిరంతరం జీవనదిలో ప్రవహిస్తూ.. ఆలయ మహిమకు జీవం పోస్తోంది. కాగా 2012లో సప్తశివాలయాలను కాశీనాయన ఆశ్రమం వారు జీర్ణోద్దరణ గావించారు. అలాగే ప్రస్తుతం అమ్మవారి ఆలయ జీర్ణోద్దరణ పనులు జరుగుతున్నాయి.
క్షేత్రానికి చేరుకోవడం ఇలా
కర్నూలు నుంచి 67 కిమీల దూరంలో వున్న ఆత్మకూరు పట్టణానికి చేరుకోవాల్సి వుంటుంది. అక్కడి నుంచి 16కిమీల దూరంలో వున్న కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి శివపురం చెంచుగూడేం మీదుగా కిమీలు ప్రయాణిస్తే.. కొలనుభారతి క్షేత్రానికి చేరుకోవచ్చు.
0 Comments:
Post a Comment