బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని తుఫాను వల్ల తీరప్రాంతం అలజడిగా వుంది. అక్కడక్కడా భారీవర్షాలు పడుతున్నాయి. అయితే తుఫాను కారణంగా ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రథంగా దీనిని భావిస్తున్నారు.
అసాని తుపాన్ ప్రభావంతో ఇది సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడూ చూడని వింతైన రథం మంగళవారం కొట్టుకు వచ్చింది.
ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాష లో లిఖించి వుంది. ఇది మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు.
ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదంటున్నారు. దీనిని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అది ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది. బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావడంతో స్థానికులకు వింత అనుభూతికి లోనవుతున్నారు.
తీవ్రతుఫాను నుంచి తుఫానుగా బలహీనపడింది అసని. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది తుఫాను. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది.
ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకి 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం వుందంటోంది వాతావరణ శాఖ.
ఆతర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం వుందని తెలుస్తోంది.
0 Comments:
Post a Comment