✍️ఆధార్‌పై ముసుగేసి.. తీసేసి.
♦కేంద్రం గందరగోళ ఆదేశాలు
♦ఫొటోకాపీలు ఎవరితో పంచుకోవద్దంటూ హెచ్చరిక
♦వివాదం చెలరేగడంతో ఉపసంహరణ
*🌻ఈనాడు, దిల్లీ:* ఆధార్‌కార్డు ఫొటోకాపీని ఏ సంస్థతోనూ పంచుకోవద్దంటూ భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) విడుదల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కార్డు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు.. ఫొటోకాపీˆలు కాకుండా, మాస్క్‌డ్ ఆధార్‌కార్డును మాత్రమే ఇవ్వాలని సూచించింది. అయితే ఆధార్ సమాచారానికి భద్రత లేదని తాము తొలినుంచీ చేస్తున్న వాదన నిజమేనని, సామాజిక మాధ్యమాల్లో వివిధ వర్గాలు ధ్వజమెత్తడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. ‘‘ప్రజలకు హెచ్చరిక. ఆధార్ ఫొటోకాపీ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున దాన్ని ఏ సంస్థతోనూ పంచుకోవద్దు. దానికి ప్రత్యామ్నాయంగా చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించండి. దాన్ని యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే బహిరంగ కంప్యూటర్ సెంటర్లు, ఇంటర్‌నెట్ కియోస్క్‌ల నుంచి డౌన్‌లోడ్ చేయొద్దు. ఒకవేళ చేస్తే ఆ కంప్యూటర్ నుంచి మీ ఈ-ఆధార్ వివరాలన్నింటినీ శాశ్వతంగా డిలీట్ చేయండి. కేవలం యూఐడీఏఐ నుంచి లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే ఆధార్ ద్వారా వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించుకొనేందుకు అవకాశం ఉంది. హోటళ్లు, సినిమాహాళ్లు లాంటి లైసెన్సులేని సంస్థలు ఆధార్ కార్డులను సేకరించి వాటిని నిల్వచేసుకోవడానికి వీల్లేదు. 2016 ఆధార్ చట్టం కింద అది నేరం. ఏదైనా ప్రైవేటు సంస్థ మీ ఆధార్‌కార్డును చూపమనికానీ, ఫొటోకాపీ ఇవ్వమనికానీ డిమాండ్ చేస్తే అలాంటి సంస్థలకు లైసెన్స్ ఉందా? లేదా? అన్నది వినియోగదారులు తనిఖీచేసుకోవచ్చు’’ అని యూఐఏడీఐ సంస్థ ఈనెల 27వ తేదీన ప్రకటన విడుదల చేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అడిగిన చోటల్లా ఆధార్‌కార్డు చూపమని చెప్పి, ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పడంపై విమర్శలు చెలరేగాయి. దీంతో యూఐడీఏఐ ఆదేశాలను అపార్థం చేసుకోవడానికి వీలున్నందున దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆధార్ నంబర్‌ను ఇతరులతో పంచుకొనేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించడానికే ఆ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొంది.
0 Comments:
Post a Comment