📚✍️జీతం అడిగితే...ఎస్మా - విద్యుత్ ఉద్యోగులకు సర్కారు షాక్
♦️11లోగా జీతాలివ్వాలని 9న వినతి లేదంటే సహాయ నిరాకరణ చేస్తామని లేఖఆ మరునాడే సమ్మెలను నిషేధిస్తూ ఎస్మావిద్యుత్ సంస్థల పరిధిలో 6నెలలు అమల్లో
🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఏప్రిల్ నెల జీతాలు ఈ నెల 9వ తేదీవరకు రాలేదని, కనీసం 11న అయినా చెల్లించాలని కోరిన విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 11వ తేదీకి కూడా జీతాలు పడకపోతే 12వ తేదీ నుంచి ఉద్యమబాట పడతామన్న విద్యుత్ ఉద్యోగ సంఘాలను ఏకంగా ఈ సంస్థల్లో సమ్మెని నిషేధించి ప్రభుత్వం మరింత దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ నిషేధ ఉత్తర్వులు అన్ని విద్యుత్ సంస్థల్లో ఈ నెల పదో తేదీనుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. ‘‘ఇకపై ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వాలి. లేదంటే మరుసటి రోజున ఎలాంటి నోటీసు, సమాచారం లేకుండానే ఆందోళనలు చేపడుతాం’’ అని ఈ నెల తొమ్మిదో తేదీన ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ.. ఇంధన శాఖ కార్యదర్శిని కలిసి స్పష్టం చేసింది. ఈ కమిటీలో విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలైన ఏపీఈపీడీసీఎల్, ఏపీఎ్సపీడీసీఎల్, ఏపీసీడీసీఎల్, ఏపీ జెన్కోల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నాయి.
ఈ విజ్ఞాపన చేసిన మరుసటిరోజే ఈ సంస్థల్లో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వాటి అనుబంధ విభాగాలు అత్యవ సర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా)-1971 పరిధిలోనే ఉన్నాయి. ఏటేటా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎస్మాను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇస్తుంటుంది. ఇప్పటికీ ఎస్మా అమల్లోనే ఉంది. దీన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయినా ఎస్మాపేరిట సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం కోసమేనా? అయితే ఇదంతా ఎందుకు? కారణం ఏమయి ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం! తమకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఉద్యోగులు సర్కారును కోరడమే ఎస్మా ప్రయోగానికి కారణం అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు పనిచేయాలేకానీ...ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని, లేకుంటే ఆందోళన చేస్తామనడం సర్కారును ఆందోళనకు గురిచేసి ఉంటుందని, వీరిని ఇలాగే వదిలేస్తే మిగతా ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోనూ ఉద్యోగులు ఇదే బాట పడతారనే భయం వెంటాడి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి విద్యుత్ సంస్థల ఉద్యోగుల సంఘాలు.. జీతాల కోసం ప్రభుత్వాన్ని కోరడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఫిబ్రవరి 14న ఒకసారి, ఏప్రిల్ 7వ తేదీన మరోసారి దీనిపై రెండు లేఖలు రాశారు. ఇప్పుడు రాసింది మూడో లేఖ. అయితే, ఈసారి జేఏసీ స్వరం పెంచింది. అది సర్కారుకు నచ్చలేదు. విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎస్మా చట్టం తక్షణమే అమల్లోకి తెచ్చేసింది.
ఇదీ ఉత్తర్వు..‘‘ఇప్పటికే విద్యుత్ రంగంలోని సంస్థల సేవలను ఎస్మా చట్టం మేరకు అత్యవసర సేవలుగా ప్రకటించడం జరిగింది. అయినా వాటి పరిధిలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించడం అవసరం, సముచితమని ప్రభుత్వం భావించింది. కాబట్టి అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా)-1971లోని సెక్షన్2లోని సబ్ సెక్షన్ 1, 3ల మేరకు సమ్మెలను నిషేధిస్తున్నాం’’ అని ఇంధన శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు (జీవో నం.65) జారీ చేశారు.
0 Comments:
Post a Comment