Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్! జాబ్ పర్మినెంట్ వాయిదా..
AP Sachivalayam Employees: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. వారి ప్రాబేషనరీ డిక్లరేషన్ గడువు సమీపిస్తుండడంతో కీలక నిర్ణయం వెల్లడించనుంది.
లక్షలాది మంది ఉద్యోగులు ఉంటే వేలాది మందికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి మిగతా వారిని పెండింగ్ లో పెట్టాలని భావిస్తోంది. దీంతో చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను తన మానస పుత్రికగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తెచ్చేందుకే సచివాలయ వ్యవస్థను ప్రారంభించినట్టు ఆర్భాటంగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 అక్టోబరు 2 న గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించింది. 19 శాఖలకు సంబంధించి కార్యదర్శులను నియమించింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీరిని భర్తీ చేశారు.
JAGAN
మాట తప్పారు..
రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తరువాత పర్మినెంట్ ఉద్యోగులు గుర్తించి భారీగా జీతభత్యాలను చెల్లిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీంతో సొంత ఊరిలో ఉద్యోగం చేసుకోవచ్చన్న భావనతో చాలామంది ప్రైవేటు ఉన్నత కొలువులను విడిచిపెట్టారు. ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ పూర్తిచేసిన వారు సైతం సచివాలయ ఉద్యోగాల వైపు మొగ్గుచూపారు.
సాఫ్ట్ వేర్ కొలువులు సైతం విడిచిపెట్టిన వారున్నారు. కానీ ప్రభుత్వం పేర్కొన్నట్టు 2021 అక్టోబరు నాటికి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. డిపార్ట్ మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే చేస్తామని కొత్త షరతు విధించింది. అదరాబాదరాగా డిపార్ట్ మెంట్ పరీక్షలు నిర్వహించింది. అప్పటికే పని ఒత్తిడి, సమయం ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడంతో చాలామంది ఉత్తీర్ణత సాధించలేదు.కానీ ఉత్తీర్ణత సాధించిన వారికి సైతం అప్పట్లో ప్రొబేషన్ ఇవ్వలేదు. గడువును ఈ ఏడాది జూన్ వరకూ పొడిగిస్తూ అందరికీ ఒకేసారి ప్రొబేషన్ ప్రకటిస్తామని ప్రభుత్వం మడత పెచీ పెట్టింది.
మరో'సారి'
అయితే ప్రభుత్వ గడువు సమీపించింది. ఇప్పుడు కూడా మరోసారి ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తోంది. పరీక్షలు పెట్టి ఫెయిలయ్యారని చెప్పి రెండొంతుల మందికి పర్మినెంట్ చేయడం లేదని తెలుస్తోంది. కేవలం 50 వేల మందికి మాత్రమే పర్మినెంట్ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 27వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సచివాలయానికి కనిష్టంగా 11 మంది కార్యదర్శులను నియమించింది. కానీ ఎక్కడా కార్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. నూతన భవనాలు సైతం అందుబాటులోకి రాలేదు. ఇరుకు గదుల్లో చాలీచాలని వసతుల నడుమ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లేని విధంగా యూనిఫారం అమలుచేస్తోంది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయకుంటే జీతాల్లో కోత విధిస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారన్న భావనతో సచివాలయ ఉద్యోగులు సహనంతో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం తీరు చూస్తే ఇప్పట్లో ప్రొబేషన్ డిక్లేర్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.
AP Sachivalayam Employees
అనవసరంగా సచివాలయ ఉద్యోగానికి వచ్చి నష్టపోయామన్న భావన బాధితుల్లో నెలకొంది. ఇప్పుడు పర్మినెంట్ చేయకపోతే ఇంకెప్పుడూ చేయరని వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఉద్యోగ సంఘాల నేతలు కూడా నోరెత్తడం లేదు.నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టడమే కాదు.. ఇప్పుడు ఫెయిలయ్యారని ఆపేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులు వాదిస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘ నేతలు కూడా వారి గోడును పట్టించుకోవడం లేదు.
0 Comments:
Post a Comment