Andhra News: ‘అసని’ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ పరీక్షలపై పడింది. తుపాను ప్రభావంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
0 Comments:
Post a Comment