ఆడుతూ.. పాడుతూ.. అభ్యాసం
ప్రతిరోజు తొమ్మిది విభాగాల్లో ..
ఒత్తిడి లేని విధానంలో విద్యార్థులకు బోధన
ఆహ్లాద వాతావరణంలో తరగతులు
పిల్లల్లో ఉండే నైపుణ్యాలకు పదును పెడితే..
వారు దేన్నైనా సాధిస్తారు. వారి ఇష్టం, ఆసక్తిని గమనించి.. ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అద్భుతాలను ఆవిష్కరిస్తారు. విద్య అంటే పిల్లలు సహజసిద్ధంగా నేర్చుకునే ప్రక్రియ. కానీ ప్రస్తుతం విద్యావిధానాన్ని చిన్నారుల ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా రుద్దే ప్రక్రియగా ప్రస్తుతం మార్చేశారు. ఇలాంటి సమయంలోనూ విజయవాడలోని ఓ పాఠశాల వినూత్న పద్ధతిలో ఒకవైపు చిన్నారుల్లోని నైపుణ్యాలకు పదును పెడుతూ వారి మానసిక పరిపక్వతకు పెద్దపీట వేస్తూనే.. మరోవైపు పాఠ్యాంశాల్లో మిగతా పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతోంది. అదే విజయవాడలోని గుణదల గంగిరెద్దులదిబ్బ ప్రాంతంలో ఉన్న అభ్యాస విద్యాలయం.
విద్యార్థులకు మూస ధోరణిలో బట్టీపట్టించి నేర్పించే పద్ధతి ఇక్కడ ఉండదు. ఏదైనా కచ్చితంగా ప్రాక్టికల్‌గా చూసి.. నేర్చుకోవాల్సిందే. మిగతా పాఠశాలల మాదిరిగా.. ఒకటో తరగతి, రెండో తరగతి అంటూ గదులు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అలాగే కదలకుండా కూర్చోబెట్టే పద్ధతి ఇక్కడ ఉండదు. మేథ్స్ గది, సైన్స్ గది.. అంటూ ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఉంటాయి. మేథ్స్ గదిలో అన్నీ లెక్కలకు సంబంధించిన పరికరాలే ఉంటాయి. దుకాణాల్లో ఉండే తూనిక రాళ్ల నుంచి మొదలుపెట్టి అన్ని లెక్కలు నేర్పించే పరికరాలే ఉంటాయి. ఆ వాతావరణంలోనికి రాగానే.. విద్యార్థులలో సబ్జెక్టులపై ఉండే భయం పోతుంది ఏ సబ్జెక్టుకు సంబంధించిన గదిలో ఆ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారు. పిల్లలే పిరియడ్‌ను బట్టి గదులు మారుతూ వెళుతుంటారు.
వంటలపైనా అవగాహన
ప్రశంసలు.. పురస్కారాలు...
అభ్యాస విద్యాలయంలోని విద్యావిధానానికి ఎంతోమంది నుంచి ప్రశంసలు దుక్కుతున్నాయి. తరచూ ప్రముఖుల ముఖాముఖిలను క్లిక్ టాక్స్ పేరుతో విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, డాక్టర్ జయప్రకాష్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, స్టోరీ టెల్లర్ దీపాకిరణ్, ఫిన్‌లాండ్ నుంచి విద్యావేత్త కులకర్ణి తదితర ప్రముఖులతో కొవిడ్ సమయంలో క్లిక్ టాక్స్‌ను నిర్వహించింది. ఇక్కడి బోధనా పద్ధతులను చూసి వీరంతా అభినందించారు. పాఠశాలకు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎడ్యుకేషన్ వరల్డ్ నుంచి 2019లో బెస్ట్ ఇన్నోవేటివ్ స్కూల్ అవార్డు, 2022లో బెస్ట్ బడ్జెట్ స్కూల్ అవార్డు దక్కింది. బ్రెయిన్ ఫీల్డ్ మాగజైన్ భారతదేశంలోని 500 ఇన్నోవేటివ్ పాఠశాలల్లో అభ్యాసకు విజయవాడ నుంచి మొదటి స్థానం లభించింది. సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ అభ్యాసను దేశంలోని ఇన్నోవేటివ్ పాఠశాలల్లో ఒకటిగా గుర్తించింది. ఇక్కడి బోధనా పద్ధతులపై ప్రత్యేకంగా వెబ్‌సైట్ https://linktr.ee/abhyasavidyalayam ను రూపొందించి.. అందరికీ అందుబాటులో ఉంచారు.
ప్రతిరోజు తొమ్మిది విభాగాల్లో ..
విద్యాలయంలో తొమ్మిది రకాల వాతావరణంలో ప్రతిరోజు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. సైన్స్, తెలుగు, ఇంగ్లిష్, గణితానికి సంబంధించి పూర్తి సబ్జెక్ట్ వాతావరణంలో ఏర్పాటు చేసిన గదులుంటాయి. గ్రంథాలయం ఒక పీరియడ్ ఉంటుంది. ఇండోర్, అవుట్‌డోర్ ఆటలు రోజుకు కనీసం గంటకుపైగా ఆడతారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఒక పీరియడ్ ఉంటుంది. పాఠశాల పైభాగంలో ప్రత్యేకంగా ఒక హోం థియేటర్‌ను సిద్ధం చేయించారు. దీనిని విద్యార్థులే స్వయంగా సౌండ్‌ప్రూఫ్‌గా వారి నైపుణ్యం ఉపయోగించి చేసుకోవడం గమనార్హం. తరగతికి కేవలం 24 మందిని మాత్రమే చేర్చుకుంటారు. పేద విద్యార్థులకు సగం మందికి పైగా ఉచితంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ప్రతి విద్యార్థిలో ఒక విత్తనం ఉంటుంది. దానిని స్వేచ్ఛగా మొలకెత్తి ఎదిగేందుకు అవసరమైన వాతావరణం మా విద్యాలయంలో కల్పిస్తాం. అంతే తప్ప ఆ విత్తనం నుంచి వేరే చెట్టును మొలకెత్తించేందుకు ప్రయత్నం చేయం. ఎప్పుడైతే వారి సహజసిద్ధ నైపుణ్యాలకు తగ్గట్టుగానే మన బోధన ఉంటుందో.. వారి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. పిల్లలకు ఐదో తరగతి వరకు పుస్తకాల బరువులే ఉండవు. వారిలో ఒత్తిడి పెంచడానికి మేం విరుద్ధం.
0 Comments:
Post a Comment