87 ఏళ్ల వయసులో 10, 12వ తరగతుల్లో ఉత్తీర్ణత
హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా ఘనత
న్యూఢిల్లీ, మే 10: హరియాణా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా వయసు 87 ఏళ్లు. ఈ వయసులో ఆయన 10, 12వ తరగతులు ఉత్తీర్ణుడయ్యారు. దీంతో మంగళవారం ఆయనకు హరియాణా విద్యా బోర్డు అధికారులు చండీగఢ్‌లో మార్కుల షీటు అందజేశారు. ఓం ప్రకాశ్ ఓ కేసులో 2019లో తిహార్ జైలులో ఉన్న సమయంలో పదో తరగతి పరీక్షలు రాశారు. అప్పుడాయన ఇంగ్లిష్ పరీక్షకు గైర్హాజరయ్యారు. ఆ పరీక్ష మళ్లీ రాయకుండానే.. హరియాణా ఓపెన్ బోర్డు 2021లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షలను ఓం ప్రకాశ్ రాశారు. అయితే, ఓం ప్రకాశ్ పదవ తరగతి ఇంగ్లిష్‌లో ఉత్తీర్ణుడు కాలేదని అధికారులు గుర్తించి ఆయన 12వ తరగతి ఫలితాలను నిలిపివేశారు. దీంతో నిరుడు ఆగస్టులో ఓం ప్ర కాశ్ పదో తరగతి ఇంగ్లిష్ రాశారు. అందులో ఆయన 100కి 88 మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణత సాధించారని తాజాగా అధికారులు చెప్పారు. 10వ తరగతి ఉత్తీర్ణుడు కావడంతో ఆయనకు సంబంధించిన 12వ తరగతి ఫలితాలనూ ప్రకటించారు. అందులోనూ ఉత్తీర్ణుడయ్యారని చెప్పారు.
0 Comments:
Post a Comment