✍️సదుపాయాలుంటే 3, 4,5 తరగతుల విలీనం
🌻ఈనాడు, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. దీనిపై శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు జిల్లా విద్యాధికారులతో (డీఈఓ) ప్రత్యేక కార్యశాల నిర్వహించింది. కిలోమీటరు దూరంలోని ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్‌ను కమిషనరేట్‌లోనే డీఈఓలు పూర్తి చేశారు. మొదట కిలోమీటరు దూరంలోని 3, 4, 5 తరగతులన్నింటినీ తరలించాలని నిర్ణయించారు. అవసరమైన చోట ‘నాడు-నేడు’ కింద అదనపు తరగతి గదులు నిర్మించాలని అంచనాలు రూపొందించారు. నిధుల కొరత కారణంగా గదుల నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభించలేదు. ఒకవేళ జూన్‌లో నిర్మాణాలు చేపట్టినా అవి పూర్తయ్యేందుకు 3 నెలల సమయం పడుతుంది. జులై 4 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈలోగా అదనపు తరగతి గదులు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సదుపాయాలున్న చోటే మ్యాపింగ్ చేస్తున్నారు. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి గదులు ఎక్కువగా ఉంటేనే 3, 4, 5 తరగతులను విలీనం చేస్తారు. లేదంటే కాగితాల్లో మాత్రమే మ్యాపింగ్ చూపి పిల్లలను ప్రాథమిక బడుల భవనాల్లోనే ఉంచుతారు.
0 Comments:
Post a Comment