నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం
'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో.... మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది' అంటారు కందుకూరి వీరేశలింగం.
పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం... అనుభూతి... అది అనుభవించే వారికే తెలుస్తుంది. పుస్తకాన్ని చదవడం కనుక అస్వాదించగలిగితే... దాన్ని మించిన తృప్తిని మరింకేదీ ఇవ్వదంటే అతిశయోక్తి కాదు. పుస్తకం అమ్మ వలే లాలిస్తుంది. నాన్న వలే ఆదరిస్తుంది.
గురువులా బోధిస్తుంది... మార్గదర్శి అవుతుంది. ఒంటరితనంలో స్నేహితుడై ఓదార్పునిస్తుంది... ప్రియురాలై అక్కున చేర్చుకుంటుంది. 'పుస్తకాలు దీపాలవంటివి. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది' అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. అదే ఆయుధం పుస్తకం అయితే... ప్రపంచాన్నే గెలవగలము. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధం. సమాజాన్ని ప్రగతిపథాన నడిపే దిక్సూచి పుస్తకం.
మనమెంతటి ఆధునిక యుగంలో వున్నా, టాబ్‌లలో పిడిఎఫ్ పుస్తకాలు చదువుతున్నా, ఇంటర్నెట్‌లో అనంతమైన సాహిత్యం లభ్యమౌతున్నా... అవన్నీ పుస్తకాన్ని రీప్లేస్ చేయాలేవని, పుస్తకం చదివిన అనుభూతిని అందించలేవు.
పుస్తకాలంటే ఇష్టపడే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా.. దాని చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
థీమ్
ప్రపంచ పుస్తక దినోత్సవం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏమిటంటే- చదవడం వల్ల కలిగే ఆనందాన్ని, అనుభూతిని చాటి చెప్పడం. పఠనాన్ని విస్తతం చేసి పుస్తకాల పరిధిని గుర్తించాలనేది ప్రణాళిక.
యునెస్కో ప్రకారం..2021లో జార్జియాలోని టీబీలీసీ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం యునెస్కో.. పుస్తక పరిశ్రమలోని మూడు ప్రధాన రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలు, ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు, లైబ్రరీలతో కలిసి.. ఒక సంవత్సర కాలానికి ప్రపంచ పుస్తక రాజధానిగా టీబీలీసీ నగరాన్ని ఎంచుకున్నాయి.
చరిత్ర
స్పానిష్ గొప్ప రచయిత మిగుల్ డె సెర్‌వాన్‌టెస్. ఈయన రాసిన డాన్ క్విక్సోట్ అనే నవల బాగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ సాహిత్య శిఖరాల్లో ఈ నవల అగ్రభాగాన నిలిచింది. ఈయన అక్టోబర్ 7న జన్మించగా.. ఏప్రిల్ 23న మృతి చెందారు.
ఈయన మరణించిన తేదీనే పుస్తక దినోత్సవంగా జరుపుకొని ఆయనకు గౌరవం ఇవ్వాలనే ఆలోచన ప్రముఖ స్పానిష్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్‌కు వచ్చిందట. అలాగే విలియం షేక్స్‌పియర్, గార్సియాసా డి లా వేగా వంటి ప్రముఖ రచయితలు కూడా మరణించింది కూడా ఏప్రిల్ 23వ తేదీనే.
అలాగే అనేక ఇతర రచయితలు పుట్టిన, మరణించిన తేదీ కూడా ఏప్రిల్ 23న కావడం వల్ల.. 1955, ఏప్రిల్ 23న యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంను నిర్వహించింది.
దీంతో ప్రతిఏడాది స్పెయిన్‌లో ఘనంగా పుస్తక దినోత్సవం జరుగుతుంది. స్పెయిన్‌లోని కాటలోనియాలో పుస్తక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇక ప్రత్యేకించి యునెస్కో.. ఈ పుస్తక దినోత్సవం సందర్భంగా.. ప్రతిఏటా పఠనాన్ని ప్రోత్సహించేవిధంగా లక్ష్యాలను ఏర్పరచుకుంది. ఆ లక్ష్యాల దిశగానే.. పుస్తకాల్ని ప్రచురించడంతోపాటు.. కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి.. వాటి గురించి విస్తృత ప్రచారం చేయడం వంటివి చేస్తోంది.
గతంలో.. వర్తమానంలో...
ఒకప్పుడు టీవీలు, సెల్‌ఫోన్లు ఏమీ లేవు. అందుకే ఎక్కువమంది పుస్తకాలు చదివేవారు. ఇప్పుడలా లేదే.. అరచేతిలో సెల్‌ఫోన్ ఉంటే.. పుస్తకాల జోలికే వెళ్లడం లేదు. ఏమైనా చదవాలనుకున్నా.. సెల్‌ఫోన్‌లోనే బుక్స్ చదువుతున్నారు.
అంతలా నేడు సమాజం మారిపోయింది. ఇక పిల్లల సంగతి చెప్పుకోనక్కర్లేదు. హోంవర్క్‌లు, పరీక్షలతోనే వారి సమయం గడిచిపోతుంది. ఇక పుస్తకాల్ని చదివే తీరికెక్కడిది? గతంలో ఇంట్లో పెద్దవాళ్లు ఆదివారమో లేక, దసరా, వేసవి సెలవుల్లోనూ కచ్చితంగా పిల్లలకి నీతిని బోధించే కథల పుస్తకాలు, ఇంకా రకరాల పుస్తకాలు వారి వయసుకు తగ్గట్టుగా ఇచ్చి చదివించేవారు.
అలా చదివిన తర్వాత ఎంతో ఓపిగ్గా ఆ స్తకం ద్వారా వారేం గ్రహించారో అడిగి తెలుసుకునేవారు. దీనివల్ల.. పిల్లలకి పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేది. నేడు పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చి ప్రోత్సహించినంతగా.... మంచి పుస్తకాలు చదివేందుకు ప్రోత్సహించడంలేదనేది నిర్వివాదాంశం.
ఈ బిజీ లైఫ్‌లో పడి పిల్లల మానసికోల్లాసానికి అడ్డుకట్టలేస్తున్నామా? అనేది ఈ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. గతంలో పుస్తకాన్ని చేతిలో తీసుకుని ప్రశాంతమైన వాతావరణంలో చదివేవారు.
దాంతో వారి ఊహాశక్తితోపాటు, మానసిక ఒత్తిడి తగ్గేది. ఇప్పుడు సెల్‌ఫోన్‌లో చదవడం వల్ల అనేకంటే... ఇతరత్రా పనులకు సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
'పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి' అంటాడు ప్రముఖ రచయిత కాఫ్కా.. మన మెదడులో గడ్డకట్టిన నిర్లిప్తత, నిరాశక్తతలను బద్దలు కొడితే, అప్పుడు పుస్తకం తేటగా కనిపిస్తుంది. పుస్తకం చేతిలోకి తీసుకుంటే... పసిపాపను చేతుల్లోకి తీసుకున్నంత ఆహ్లాదం కలుగుతుంది. పుస్తకం పట్టుకుని చదవడం అలవాటు చేసుకుంటే.. ఆ పుస్తకానికి మనకి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఎన్నో జ్ఞాపకాల్ని మనసుల్లో నింపుతుంది. అందుకు పుస్తకాన్ని మించిన స్నేహితులు లేరు.
ప్రయోజనాలు
పుస్తకం... మూడు అక్షరాలే ఉన్నా.. మానవ మెదడుకి సరికొత్త ఆవిష్కరణలను నేర్పుతుంది. కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. మనిషికి ఊహాశక్తిని కల్పిస్తుంది. పాత సమాజపు లోపాలను కనిపెట్టి.. ముందు తరాలకు ప్రగతిపథాన్ని నిర్మిస్తుంది.
సమాజ పురోగతికి తోడ్పడుతుంది. తరతరాలకు విజ్ఞానాన్ని అందిస్తుంది. సమాజ పురోగతికి దోహదపడుతుంది. మానవ సంబంధాలు మెరుగుపడేందుకు సహాయం చేస్తుంది.
మరీ ముఖ్యంగా మానసిక ఒత్తిడిని అధిగమించేలా చేస్తుంది. పుస్తకం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. అందుకే ఈ 'పుస్తక దినోత్సవం' నుంచి కచ్చితంగా పుస్తకాలు చదవాలనే నిబంధన పెట్టుకుందాం. 'చదువు... పోరాడు... సమీకరించు' అన్న నినాదానికి ఆచరణ రూపాన్నిద్దాం.
0 Comments:
Post a Comment