ప్రభుత్వ బడిలో 'గణిత పార్క్'!
ఒడిషాలోని పూజారి పాలికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సుభాష్ చంద్ర సాహు తన గ్రామంలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు, గణితం అంటే భయాన్ని తొలగించేందుకు బడి ఆవరణలో 'గణిత పార్కు'ను అభివృద్ధి చేశాడు.
ఆడుతూపాడుతూ గణితాన్ని అభ్యసించేందుకు లెక్కలకు సంబంధించిన సంజ్ఞలతో 20 డెసిమల్ ఏరియాలో ఈ పార్కును తీర్చిదిద్దాడు.
గణితంలో బోలెడు సిద్ధాంతాలు, అంతకుమించిన సూత్రాలు.. వీటికి తోడు రేఖాగణిత ఆకారాలు, సంఖ్య చిహ్నాలు, టేబుల్స్, కూడికలు, తీసివేతలంటూ లెక్కకు మించి ఉంటాయి. అందుకే గణితశాస్త్రం బేసిక్స్ సహా సూత్రాలను ఆచరణాత్మకంగా అర్థం చేసుకోగలిగేందుకు ఇన్‌స్టాలేషన్స్ ఏర్పాటు చేశాడు. పెయింటెడ్ రాళ్ల నుంచి పందిరి, బెంచీలు, చివరకు చెట్ల వరకు పార్క్‌లోని ప్రతీది లెక్కల సబ్జెక్ట్‌కు సంబంధించిన గుర్తులమయమే. ఈ క్రమంలోనే వివిధ గణిత శాస్త్రవేత్తలతో పాటు, సిద్ధాంతాల సమాచారాన్ని వర్ణించే వాల్ పెయింటింగ్స్, స్టాండీలు కూడా ఉన్నాయి. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ పార్క్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. సుభాష్ సహా కొంతమంది గ్రామస్థులు ఇందుకోసమైన ఖర్చును భరించారు.
వాస్తవానికి, సాహు వినూత్నమైన అభ్యాస విధానం పూజరి పాలి గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. 2020లోనే కొవిడ్-19 వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూతబడినప్పుడు.. వర్ణమాలలు, సంఖ్యలు, మ్యాప్స్ వంటి లెర్నింగ్ మెటిరీయల్‌ను చార్ట్స్‌పై రంగురంగుల్లో పెయింట్ చేసి, వాటిని చెట్లకు వేలాడదీసి పిల్లలకు బోధించగా, ఆ తర్వాత గ్రామంలోని ప్రతీ ఇంటి వెలుపల వేర్వేరు చార్టులను ఉంచడం ప్రారంభించాడు. తద్వారా పిల్లలు బయటకు వచ్చినప్పుడల్లా ఏదైనా నేర్చుకోవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో పాటు వారి పూర్తి సమాచారాన్ని ప్రదర్శించే బోర్డులను కూడా గ్రామ రహదారులకు ఇరువైపులా పెయింట్ చేయించాడు.
'మా విద్యార్థులకు ఇంగ్లీష్, గణితంలో అంతగా నైపుణ్యం లేదు. ఇక పిల్లలెప్పుడూ భయపడే సబ్జెక్ట్ గణితం. ఈ నేపథ్యంలో వారికి సులువుగా, సరదాగా లెక్కలు నేర్పించాలనుకున్నా. తద్వారా ఆసక్తి పెంచుకుని మరింత హుషారుగా చేస్తుంటారు. పిల్లలను గణితంలో నిష్ణాతులను చేయడమే నా లక్ష్యం'
- సుభాష్ చంద్ర సాహు
0 Comments:
Post a Comment