SBI: రైతు 31 పైసల బకాయి చెల్లించలేదని.. బ్యాంకు ఏం చేసిందో తెలుసా..?
అహ్మదాబాద్: ఓవైపు కొందరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పోతుంటే.. సామాన్యులను మాత్రం బ్యాంకులు పైసా కోసం వేధిస్తుంటాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని నిజం చేసేలా జరిగిన ఓ ఘటన గుజరాత్లో తాజాగా వెలుగుచూసింది. ఓ రైతు కేవలం 31 పైసల బకాయిలు చెల్లించలేదని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘నో డ్యూ సర్టిఫికేట్’ ఇవ్వలేదు. దీంతో ఆ రైతు భూమిని విక్రయించేప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. ఇదికాస్తా హైకోర్టుకు చేరడంతో.. ఎస్బీఐ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..
అహ్మదాబాద్ సమీపంలోని ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ 2020లో తన పేరుమీద ఉన్న కొంత భూమిని రాకేశ్ వర్మ, మనోజ్ వర్మకు విక్రయించారు. అయితే అంతకంటే ముందే ఈ భూమిపై శ్యాంజీ రూ.3లక్షల పంట రుణం తీసుకున్నారు. భూమిని అమ్మిన కొద్ది రోజుల తర్వాత తాను బ్యాంకు నుంచి తీసుకున్న రుణం మొత్తాన్ని శ్యాంజీ తిరిగి చెల్లించారు. ఆ తర్వాత కొనుగోలుదారులు ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి తమ పేరును నమోదుచేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే రుణానికి సంబంధించి బ్యాంకు నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో అది సాధ్యపడలేదు. బ్యాంకు వద్దకు వెళ్తే సమస్య పరిష్కారం కాకపోవడంతో కొత్త యజమానులు రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు
ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. బ్యాంకు నో డ్యూ పత్రాన్ని ఎందుకు ఇవ్వలేదని కోర్టు అడగ్గా.. ఎస్బీఐ తరఫు న్యాయవాది చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి అవాక్కయ్యారు. ‘‘ఆ పత్రాన్ని సిస్టమ్ జనరేట్ చేస్తుంది. రైతు తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసలు బకాయి ఉంది. అందుకే నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడం సాధ్యం కాలేదు’’ ఎస్బీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ సమాధానంతో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం.. 50 పైసల కంటే తక్కువ ఉన్నదాన్ని లెక్కలోకి తీసుకోరు. ఆ రైతు పంట రుణం మొత్తం తిరిగి చెల్లించాడు. అయినా కానీ మీరు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇది ప్రజలను వేధించడం కాక మరేంటీ?’’ అని కోర్టు ప్రశ్నించింది. బ్యాంకు మేనేజర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
0 Comments:
Post a Comment