RTA Registration Cards: నకిలీ కార్డులకు చెక్... ఒకేదేశం-ఒకే కార్డు...
RTA Registration Cards: ఆర్టీఏ రిజిష్ట్రేషన్ కార్డులు పూర్తిగా మారిపోయాయి. అధునాతన రక్షణ అంశాలతో పాటు రంగు మారిపోయింది. దేశం అంతటా ఒకే కార్డు ఉండేలా మార్పులు చేశారు.
చిప్‌తో పాటు కార్డుల వెనుక భాగంలో క్యూఆర్ కోడ్‌ను అమర్చారు. తద్వారా నకిలీ కార్డుల ఆట కట్టించనున్నారు. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల జారీలో ఈ విధానం పాటిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ వెనుక ఏ వాహనం నడిపే అనుమతి ఉందో దానికి సంబంధించిన బొమ్మలు ముద్రించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన కార్డులోని సెక్యురిటీ ఫీచర్లు, ఇతర అంశాలపై ప్రత్యేక కథనం.
RTA Registration Cards: తరచూ పోలీసులు నిర్వహించే నిర్బంధ తనిఖీల్లో ఎక్కువగా సరైన పత్రాలు లేని వాహనాలు లభిస్తుంటాయి. ఇందులో రిజిస్ట్రేషన్ లేని, చోరీ చేసిన వాహనాలు ఉన్నాయి. ఇక వాహనాల తనిఖీల సమయంలో చాలా మంది కలర్ జిరాక్సుతో కూడిన డ్రైవింగ్ లైసెన్సులు చూపిస్తుంటారు. ఇందులో నిజమైన వ్యక్తులు ఉన్నా.. దాంతో పాటే నకిలీలు కలర్ జిరాక్స్ కార్డులు చూపించి తప్పించుకుంటున్నారు. అప్పటికప్పుడు కార్డు వివరాలు నిజామా? కాదా? అని తేల్చేందుకు తగిన సమయంలో తనిఖీ అధికారులకు చిక్కడం లేదు. అయితే రవాణాశాఖలో వచ్చిన నూతన మార్పులు వీటికి చెక్ పెట్టనుంది. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సులపై క్యూఆర్ కోడ్ల ఏర్పాటుతో ఫోన్లో స్కానర్ సాయంతో తక్షణం వివరాలు తెలుసుకునే వీలు కలుగుతోంది.
ఒకే దేశం-ఒకే తరహా కార్డులు: నూతన మోటారు వాహనాల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం రిజిష్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డుల జారీలో కీలక మార్పులు చేసింది. ఒకే దేశం ఒకే తరహాలో ఉండేలా చర్యలు తీసుకున్నా... నకిలీల కట్టడి కోసం అందులో క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. జనవరి నుంచి నమోదు చేసుకున్న వాహనాలకు ఈ విధానం వర్తింపజేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మేరకు 5వేల వాహనాలు ఉంటాయి. వీరందరికీ కొత్త కార్డులే ఇవ్వనున్నారు. వాహనాల తనిఖీల సమయంలో చాలా మంది నకిలీ ఆర్సీ కార్డులు చూపించి తప్పించుకొంటున్నారు. కొందరు ఏళ్ల తరబడి రిజిష్ట్రేషన్ చేయించుకోవడం లేదు. మరోవైపు చోరీ చేసిన బండ్లను సైతం దర్జాగా తిప్పుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా నూతన కార్డులు అందుబాటులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
రవాణాశాఖలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మొత్తం కంప్యూటరైజ్డ్ శాఖగా ప్రజలకు సేవలందిస్తోంది. 59 రకాల సర్వీసులను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాం. ప్రజలంతా కూడా 59 రకాల సర్వీసులను ఆన్లైన్ ద్వారా సేవలు పొందుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో మార్పులు వచ్చాయి. దేశమంతటా ఒకే కార్డు ఉంటుంది. ఇందులో చిప్ ఉంటుంది. క్యూఆర్ కోడ్, వెహికిల్ నెంబర్ పొందుపర్చారు. ప్రతిఒక్కరూ కూడా తమ సెల్ఫోన్లో క్యూఆర్‌ను కోడ్‌ను స్కాన్ చేసి తమ వివరాలను చూసుకోవచ్చు.
-- వెంకటరమణ, డీటీసీ, నిజామాబాద్
రంగు మారిన కార్డులు: ప్రస్తుతం కార్డుల రంగు పూర్తిగా మారింది. డెబిట్ కార్డుల తరహాలో చిప్, డిజిటల్ రంగులు ఉంటున్నాయి. ప్రధానంగా వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ పొందుపర్చారు. దీన్ని స్కాన్ చేస్తే లింక్ సాయంతో వివరాలన్నీ సెకన్ల వ్యవధిలో తెలిసిపోతాయి. ఈ విధానం రవాణా, పోలీసు శాఖలకు తనిఖీల సమయంలో ఉపయోగపడనుంది. దేశంలో ఎక్కడి అధికారులైనా సులువుగా వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలుగుతోంది. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా కార్డులు ఉండేవి. దాని వల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేటప్పుడు సరిహద్దుల్లో తనిఖీలతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు దేశం మొత్తం ఒకే కార్డులు అందుబాటులోకి రావడంతో ఈ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
0 Comments:
Post a Comment