దిశ, ఫీచర్స్ : సాధారణంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణం. పెళ్లి, పుట్టినరోజు, మ్యారేజ్ యానివర్సరీ, గృహ ప్రవేశం.. ఇలా అనేక సందర్భాల్లో బంధువులు, స్నేహితులకు కానుకలు ఇస్తుంటాం.
మనమిచ్చే గిఫ్ట్స్ వారికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు శుభం కలగాలని కోరుకుంటాం. మరి అలాంటి బహుమతులు ఏంటి? ఎందుకు ఇవ్వాలి? చూద్దాం.
వెండి బహుమతులు :
స్వచ్ఛమైన లోహాల్లో వెండి ఒకటి. వాస్తుశాస్త్రం ప్రకారం వెండితో తయారుచేసిన బహుమతులు ఇవ్వడం లేదా స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
తద్వారా అమ్మవారి కటాక్షంతో అన్నింటా విజయం సాధిస్తూ, వ్యాపారం వృద్ధి చెంది.. ఇంట్లో్కి ఎప్పుడూ డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతీ శుభకార్యంలో దీపం కుందులు, కుంకుమ భరిణ వెండితో తయారుచేసినవే వినియోగిస్తుంటారు.
గణేశుడి ఫోటోలు :
గణేశుడి ఫోటో లేదా పెయింటింగ్‌ను బహుమతిగా ఇవ్వడం శుభప్రదం. దీని వలన కానుక తీసుకున్న/స్వీకరించిన రెండు ఇళ్లలోనూ సుఖసంతోషాలు, శ్రేయస్సు ప్రాప్తిస్తాయి. లంబోదరుడి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు కూడా తీరిపోతాయి.
ఇక ఏ కార్యమైనా సరే ముందుగా గణపతి పూజతో ప్రారంభించడం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం వలన వినాయకుడు తన తొండంతో ఆటంకాలను కొట్టిపడేస్తాడని, అంత శుభం జరుగుతుందని చెప్తుంటారు.
ఏనుగు బొమ్మలు :
హిందూ మతంలో ఏనుగును చాలా పవిత్రంగా చూస్తారు. ఏనుగు గణనాథుని రూపం కనుక.. ఈ బొమ్మను కానుకగా ఇస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం.
వెండి, ఇత్తడి లేదా చెక్కతో ఉండే ఏనుగు బొమ్మలను బహుమతిగా ఇస్తే మంచిది. కానీ గాజుతో చేసిన ఏనుగు బొమ్మను బహుమతి ఇవ్వకూడదు. ఒకవేళ అది కింద పడి పగిలిపోతే.. ఆ ఇంట్లో నష్టం జరుగుతుందని విశ్వసిస్తారు.
0 Comments:
Post a Comment