ప్రస్తుతం కాశ్మీర్లో (Jammu and Kashmir) పరిస్థితి ఎలా ఉంది?
శాంతి భద్రతలు బాగానే ఉన్నాయా? ఆర్టికల్ 370 రద్దు (Article 370) తర్వాత అల్లర్లు ఏమైనా తగ్గాయా? ఈ ప్రశ్నలకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పింది.
గత ఐదేళ్లలో లోయలో జరిగిన ఉగ్రదాడి ఘటనల్లో మైనారిటీ వర్గానికి చెందిన 34 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ బుధవారం రాజ్యసభలో వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్లో 2019 ఆగస్టు 5 నుంచి ఈ ఏడాది మార్చి వరకు 14 మంది హిందువులు హత్యకు గురయ్యారని.. అందులో నలుగురు కాశ్మీరీ పండిట్లు ఉన్నారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, మైనారిటీ వర్గాల ప్రజలు ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.
ఈ క్రమంలో కాశ్మీర్ లోయలో మళ్లీ భద్రతను కట్టుదిట్టం చేశాయి బలగాలు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు స్పెషల్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
సోమవారం కాశ్మీరీ పండిట్ బాల కృష్ణపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 24 గంటల్లోనే మరికొందరు వలస కార్మికులపై దాడులకు పాల్పడ్డారు. పంజాబ్, బీహార్‌కు చెందిన 4 మంది కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపారు.
2018 నుంచి జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు మీదుగా అక్రమ చొరబాట్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2017లో 136, 2018లో 143, 2019లో 138, 2020లో 51, 2021లో 34 సార్లు చొరబాట్లు జరిగాయి. సరిహద్దు చొరబాట్లను అరికట్టేందుకు ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి బహుళ-స్థాయి విస్తరణ, సరిహద్దు ఫెన్సింగ్, నిఘా కార్యాచరణ సమన్వయాన్ని మెరుగుపరచడం, భద్రతా బలగాలకు ఆధునిక ఆయుధాలను అందించడం, చొరబాటుదారులపై ముందస్తు చర్య తీసుకోవడం వంటివి తీసుకున్నామని చెప్పారు.
ఉగ్రవాదంపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని.. దీని కారణంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని హోం శాఖ తెలిపింది. 2018లో 417 ఉగ్రవాద సంఘటనలు జరిగాయి.
ఆ తర్వాత క్రమంగా తగ్గముఖం పట్టాయి. 2019లో 255, 2020లో 244, 2021లో 229కి తగ్గింది. ఉగ్రదాడుల్లో మే 2014 నుంచి ఆగస్టు 4, 2019 మధ్య 177 మంది పౌరులు మరణించారు. మరో 406 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు .
ఇక 5 ఆగస్టు 2019 నుంచి నవంబర్ 2021 మధ్య 87 మంది పౌరులు మరణించగా. 99 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీరీ ప్రజలు తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు.
ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద అందించిన ఉద్యోగాలను కోసం దాదాపు 2105 మంది వలసదారులు కశ్మీర్ లోయకు తిరిగి వచ్చారని హోంశాఖ వెల్లడించింది.
0 Comments:
Post a Comment