ఇంటర్నెట్ డెస్క్: ఎక్కువ దూరం ప్రయాణించినా..గంటల తరబడి కూర్చున్నప్పుడు కాళ్లు వాపు రావడం సహజమే..కానీ తరచుగా కాళ్ల వాపు వచ్చిందంటే మన శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని తెలుసుకోవాలి.
కాళ్లవాపు వస్తే గుండె, కిడ్నీ జబ్బు ఉందేమోనని అనుమానించాల్సిందే. ఏదో వాతం వచ్చిందని వదిలేయకుండా సాధ్యమయినంత తొందరగా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
లేకపోతే గోటితో పోయే రోగం..గొడ్డలి దాకా వస్తుందని ఎండో వ్యాస్య్కులర్ సర్జన్ మేడా నరేంద్రనాథ్ హెచ్చరిస్తున్నారు.
ఇది ప్రమాదకరమా: కొంతమందిలో రోజంతా కాళ్లు వాపుతోనే ఉంటాయి. నొక్కి చూస్తే గుంట పడుతుంది.
రెండు కాళ్లలో వాపులు కనిపిస్తే రక్తహీనత, మూత్రపిండాలు, కాలేయం, థెరాయిడ్, గుండె జబ్బులకు సూచన కావొచ్చు. బీపీ మందులతో కూడా కాళ్లవాపు రావొచ్చు.
అదే ఒకే కాలులో వాపు ఉంటే పైలేరియాగా అనుమానించాల్సిందే. ప్రోటీన్ తగ్గినపుడు కూడా సమస్య కనిపిస్తుంది.
చికిత్స ఎలా ఉంటుంది: ముందుగా అనుమానిత పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఆ తర్వాత కిడ్నీ సమస్యతో కాళ్ల వాపు వస్తే నెఫ్రాలజీని కలిస్తే సమస్యను పరిష్కరించగలుగుతారు.
గుండెకు సంబంధించి కాళ్లవాపు వస్తే కార్డియాలజిస్టు దగ్గరకు వెళ్లాల్సిందే. బీపీ మందులతో వచ్చినా అక్కడే సూచనలు చేయగలుగుతారు.
యూరిన్‌లో ప్రోటీన్లు వెళితే ఆహారంలో మార్పులతో పాటు ఇంతకు ముందు వాడే మందులను మార్చే వీలుంటుంది.
బోదకాలయితే మందులు, ప్రత్యేక పద్ధతులతో పెరుగుదలను ఆపేయడానికి వీలుంది. వాపు కనిపించినపుడు చర్మం పొడి బారకుండా మాయిశ్చరైజ్ క్రిములను రాసుకోవాలి.
దీంతో చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. రాత్రి పూట దిండుపెట్టుకోవాలి. ఉప్పువాడకాన్ని బాగా తగ్గించుకోవాలి.
0 Comments:
Post a Comment