Andhra news: సీపీఎస్ స్థానంలో జీపీఎస్.. ఉద్యోగ సంఘాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన.
Andhra news: సీపీఎస్ స్థానంలో జీపీఎస్.. ఉద్యోగ సంఘాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన
అమరావతి: ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో సీపీఎస్ రద్దు అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశమై సీపీఎస్ రద్దు అంశంపై చర్చించనుంది. చర్చల అనంతరం ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తుంది.
ఉద్యోగ సంఘాల ముందు కొత్త ప్రతిపాదన..
రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) పేరిట కొత్త స్కీం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఎస్ బదులు జీపీఎస్ పథకం అమలు చేయాలని ప్రతిపాదన చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తూ.. ‘‘సీపీఎస్ స్థానంలో జీపీఎస్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. జీపీఎస్‌పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. పాత పెన్షన్ విధానమే కావాలని ప్రభుత్వాన్ని కోరాం. కొత్త స్కీంపై మేం అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం. జీపీఎస్ పేరిట కొత్త స్కీమ్ ఆమోదయోగ్యం కాదని చెప్పాం. కాగా, జీపీఎస్, సీపీఎస్‌కు తేడా ఏంటనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వం ఏదో విధంగా జీపీఎస్ తీసుకురావాలని చూస్తోంది. మేం జీపీఎస్‌ను ఒప్పుకోం’’ అని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.
🌹33% గ్యారెంటీ పెన్షన్ ఇస్తామని JAC నాయకులతో ప్రభుత్వ ప్రతిపాదన:-
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానంపై సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో జరిపిన చర్చల్లో
ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు CPS OPS లకు ప్రత్యామ్నాయంగా GPS(Guarantee Pension Scheme) ను ప్రతిపాదించి, దీనిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపడం జరిగింది. అయితే సిపిఎస్ విధానంలో 20.3 పర్సెంట్ వాల్యూ ఇస్తూ,OPS విధానంలో బేసిక్ పై 50శాతం పెన్షన్ మరియు డి ఎ పొందే వీలు ఉంటుంది.
కానీ *GPS విధానంలో 33 శాతాన్ని ప్రతిపాదిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.* అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని విషయాలన్నీ పరిశీలించిన తరువాత మరొక మీటింగు ఏర్పాటు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మరియు ఫైనాన్స్ సెక్రటరీల GADసెక్రటరీ తెలియజేశారు.
✍️CPS స్థానంలో GPS
♦హామీ పింఛను పథకాన్ని ప్రతిపాదించిన ప్రభుత్వం
♦బేసిక్‌లో 33 శాతం పింఛను ఇస్తామని వెల్లడి
♦డీఆర్, పీఆర్సీ వర్తించవని స్పష్టీకరణ
♦కొత్త ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాల ససేమిరా
♦సీపీఎస్‌పై చర్చలకు మరో కమిటీ
*🌻ఈనాడు, అమరావతి:* కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) స్థానంలో గ్యారంటీడ్ పింఛన్ పథకాన్ని (జీపీఎస్) తీసుకువస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతున్నందున సీపీఎస్, పాత పింఛన్ విధానానికి (ఓపీఎస్) మధ్యేమార్గంగా ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. జీపీఎస్ కింద ఉద్యోగుల పదవీవిరమణ నాటి మూలవేతనం (బేసిక్ పే)లో 33 శాతం పింఛను భద్రత కల్పిస్తామని చెప్పింది. డీఆర్, పీఆర్సీ వర్తించవనీ, ఉద్యోగికి పీఎఫ్ ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగి తన వాటాను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీన్ని పరిశీలించి సలహాలు, సూచనలు అందించాలని వెల్లడించింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టక్కర్ కమిటీ 50 శాతం పింఛను పథకాన్ని ప్రతిపాదించినా తిరస్కరించామని గుర్తు చేశారు. అంతకుముందు కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్)పై ఉద్యోగ సంఘాలతో చర్చలకు మరో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
♦సచివాలయంలో సోమవారం సీపీఎస్‌పై నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్శర్మతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీపీఎస్ గురించి ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. పింఛను సంస్కరణల సవాళ్లు, పాత పింఛను పథకం అమలులో ఆర్థిక సుస్థిరత పరిశీలన, నూతనంగా ప్రతిపాదిస్తున్న ఏపీ హామీ పింఛన్ పథకం (జీపీఎస్) వివరాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
♦పాత పింఛను పథకం సాధ్యం కాదు: బుగ్గన
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు తరాల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల సంక్షేమం దృష్ట్యా పాత పింఛను పథకం అమలు దుస్సాధ్యమైన అంశంగా పరిణమించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ‘పాత పింఛను విధానం అమలు దేశవ్యాప్తంగా పెద్ద సవాలుగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైనంత మేర లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలో హామీ పింఛను పథకాన్ని (జీపీఎస్) అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పూర్తిస్థాయిలో పరిశీలించి, సూచనలు, సలహాలు ఇవ్వాలి. తద్వారా ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసేలా ఈ పథకాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
♦ఉద్యోగులకు భద్రత కల్పించేందుకే..: సజ్జల
పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు సాధ్యమైనంత భద్రత కల్పించేలా పింఛను పథకాన్ని రూపొందించి, అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పాత పింఛను పథకం, సీపీఎస్ రెండింటినీ సమన్వయపరుస్తూ మధ్యేమార్గంగా రాష్ట్రంలో జీపీఎస్ అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల భద్రత దృష్ట్యా మంచి పింఛను పథకాన్ని రూపొందించేందుకు సలహాలు, సూచనలు అందించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కోరారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.
♦ఎలాగైనా జీపీఎస్ పెట్టాలని చూస్తోంది
- బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్
సీపీఎస్‌కు బదులు జీపీఎస్‌ను ప్రతిపాదిస్తూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బుక్లెట్ ఇవ్వాలని కోరాం. పాత పెన్షన్ విధానమే కావాలని మేం కోరుతున్నాం. జీపీఎస్‌పై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం. ఉద్యోగ, ఉపాధ్యాయులతో చర్చించాలని కోరాం. సీపీఎస్, జీపీఎస్‌ల మధ్య తేడా ఏమిటో ప్రభుత్వం చెప్పలేదు. కానీ ఏదో ఒకటి చేసి జీపీఎస్ పెట్టాలని చూస్తోంది. ఇది ఆమోదయోగ్యం కాదని అన్ని సంఘాలు పేర్కొన్నాయి. ఈ పథకం బాగుందని కేంద్ర అధికారులు చెప్పారని రాష్ట్ర అధికారులు అంటున్నారు.
♦సీపీఎస్ రద్దు చేయాల్సిందే
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్
సీపీఎస్‌పై ప్రభుత్వం మూడేళ్ల తర్వాత తొలి సమావేశం ఏర్పాటు చేసింది. జీపీఎస్ ప్రతిపాదనను ఆమోదించబోమని స్పష్టం చేశాం. పాత పింఛను విధానంలో ఉద్యోగి రిటైరయ్యాక 50% పింఛన్ భద్రతను ఎలా పొందుతారో.. అందుకు అనుగుణంగా రాష్ట్ర నిధి ఏర్పాటు చేసి పింఛను రూపంలో చెల్లిస్తామని గత ప్రభుత్వ హయాంలో టక్కర్ కమిటీ చెప్పింది. దాన్ని అప్పుడే తోసిపుచ్చాం. సీపీఎస్ రద్దు చేస్తామనే ముఖ్యమంత్రి హామీ మేరకు నిర్ణయం ఉంటుందని వచ్చాం. కేంద్రం 2019లో ఇచ్చిన గెజిట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను 14 శాతానికి పెంచలేదు. సీపీఎస్ ఉద్యోగి చనిపోతే.. అతని వాటా 50% వెనక్కి ఇవ్వాలని ఇవ్వాలని కేంద్రం 178 గెజిట్ ద్వారా చెప్పినా అందుకు అనుగుణంగా రాష్ట్రం ఉత్తర్వులివ్వలేదు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల కింద రావాల్సిన 1,800 కోట్లలో రూపాయి ఇవ్వలేదు. 10% ప్రభుత్వ వాటా కూడా ఖాతాల్లో సరిగా పడటం లేదు.
♦2100 నాటికి రూ.21 లక్షల కోట్లు అవుతుందంటున్నారు
- వెెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
సీపీఎస్ కంటే జీపీఎస్ బాగున్నా.. ఉద్యోగులు సంతృప్తి చెందే పరిస్థితి లేదు. ఉద్యోగులంతా సీపీఎస్ రద్దు చేస్తారని సీఎంపై నమ్మకంతో ఉన్నారు. దాన్ని రద్దు చేసి పాత పింఛను విధానంలోకి తేవాలని చెప్పాం. అవసరమైతే జీపీఎస్ మరింత మెరుగుపరిచి రాబోయే తరాలకు అమలు చేయాలన్నాం. ఇప్పుడు దానిలో డీఆర్ తదితర అంశాలపై స్పష్టత లేదు. ఉద్యోగ సంఘ నాయకుల్లోనూ సీపీఎస్‌లో ఉన్నవారు ఇద్దరు ముగ్గురే. అందుకే సీపీఎస్ కోసమే ఉద్యమం చేసే సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పాం. వచ్చే సమావేశానికి వారిని కూడా ఆహ్వానిస్తామన్నారు. పూర్తిస్థాయిలో పాత పింఛను పథకంలోకి వెళితే దీర్ఘకాలంలో భారమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. పాత విధానం అమలు చేస్తే.. 2100 నాటికి రాష్ట్రంలో జీతాలు, పింఛన్లకు రూ.21 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం రాష్ట్ర రాబడిలో వీటికే అధికంగా ఖర్చవుతుందని తేల్చింది. 2040 నాటికే పెన్షన్లకు రూ.1.86 లక్షల కోట్లు ఖర్చవుతుందని తెలిపింది.
♦నిర్ద్వంద్వంగా తిరస్కరించాం
- సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
జీపీఎస్ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున నిర్ద్వంద్వంగా తిరస్కరించాం. ఆర్థిక నిపుణులను నియమించుకుని, వారి ద్వారా నివేదిక రూపొందించింది. ఇప్పుడు సీపీఎస్‌లో 9% పింఛను లభిస్తుండగా.. జీపీఎస్ ద్వారా 33% భద్రత కల్పిస్తామని ప్రజంటేషన్ ఇచ్చారు. ఓపీఎస్ ఎలా లాభదాయకమో, 2031, 2050 సంవత్సరానికి సీపీఎస్ విధానం ప్రభుత్వానికి ఎంత నష్టదాయకమో వివరిస్తూ మేం అధ్యయనం చేసిన వివరాలను ఆర్థికశాఖ అధికారులకు అందించాం. మరోసారి చర్చిద్దామన్నారు.
♦కొత్త ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం
- సాయిశ్రీనివాస్, ఎస్టీయూ అధ్యక్షుడు
జీపీఎస్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. ఓపీఎస్‌కే కట్టుబడి ఉన్నాం. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండు చేస్తున్నాం.
♦పాత విధానమే కావాలి
- హృదయరాజు, కులశేఖరరెడ్డి, ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
జీపీఎస్‌ను అంగీకరించం. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి. రాజస్థాన్‌లో ఇప్పటికే చేశారు.
♦డీఏ, పీఆర్సీ వర్తింపుపై స్పష్టత ఏదీ?
పాత పింఛను పథకం (ఓపీఎస్)
1. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత.. వృద్ధాప్యంలో సామాజిక భద్రత ఉంటుంది. పింఛను బాధ్యత ప్రభుత్వానిదే.
2. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఒక్క పైసా కూడా చెల్లించనక్కర్లేదు.
3. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా డీఏ పెంపు, పీఆర్సీ వర్తించి.. పింఛను పెరుగుతుంది.
4. 70 ఏళ్లు దాటిన వారికి అదనపు క్వాంటం పింఛను, హెల్త్ కార్డుల ద్వారా వైద్యం అందిస్తారు.
5. ఉద్యోగికి భవిష్యనిధి (పీఎఫ్) ఖాతా ఉంటుంది.
6. కమ్యుటేషన్ ఉంటుంది.
7. గ్రాట్యుటీ ఉంటుంది
♦గ్యారంటీడ్ పింఛను పథకం (జీపీఎస్)
1. సీపీఎస్ ఉద్యోగి పదవీవిరమణ పొందిన తర్వాత సుమారు 20.3% పింఛను వస్తున్నట్లు లెక్క కట్టి.. దాన్ని 33 శాతానికి పెంచి ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.
2. ఉద్యోగి తన వాటా (కంట్రిబ్యూషన్) చెల్లించాలి.
3. డీఏ పెంపు, పీఆర్సీ వర్తింపుపై స్పష్టత లేదు.
4. అదనపు క్వాంటం పింఛను, హెల్త్ కార్డులపై ఏం చెప్పలేదు.
5. పీఎఫ్ ఖాతా ఉండదు.
6. కమ్యుటేషన్ ఉండదు.
7. గ్రాట్యుటీపైనా స్పష్టత లేదు.
0 Comments:
Post a Comment