IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వచ్చే పైసలతోనే ఐఏఎస్ చదివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్ డాక్టర్ బి.గోపి
నేను పక్కా పల్లెటూరి వాడిని.. పల్లె జనాల్లో గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారే.. యువత కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమపడాలి. అప్పుడే విజయం పరుగెత్తుతూ వస్తుంది. ఉన్నత ఉద్యోగాలు సంపాదించేందుకు కోచింగ్‌లు అక్కర్లేదు. పట్టుదల ఉంటే చాలు. అయితే కొన్నిసార్లు విజయం అందకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిరాశలోంచి కసి పుట్టాలి. అప్పుడే విజయం చేతికి చిక్కుతుందటారు జవహర్‌నగర్ కమిషనర్ (ఐఏఎస్) డాక్టర్ బి.గోపి.
పశువులు, పాలతో వచ్చిన ఆదాయంతోనే..
నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని తిరువాలూర్ జిల్లా పొద్దాటూర్ పేటాయి గ్రామం. మాది ఓ చిన్న పల్లెటూరు. మా ఊర్లో పెద్దగా చదువుకున్న వారు ఎవరూలేరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. పశువులు, పాలతో వచ్చిన ఆదాయంతోనే కుటుంబం గడిచింది. అమ్మానాన్నలకు చదువు రాదు. మేము ఐదుగురము. ఒక అన్న, ముగ్గురు అక్కలు. 12వ తరగతి వరకు మా ఊర్లోని పంచాయతీ యూనియన్ పాఠశాలలో చదివా. తర్వాత ఉన్నత చదువుల కోసం మద్రాస్‌కు వెళ్లి పీజీ పూర్తి చేశాను. తమిళనాడులో 6 సంవత్సరాల పాటు వెటర్నరీ సర్జన్‌గా పనిచేశా. ఆ సమయంలోనే పెళ్లయ్యింది. మా శ్రీమతి డాక్టర్. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె.
అక్కడే నా తొలిపాఠాలు..
ఆదిలాబాద్‌లో జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ జరిగింది. అక్కడే తొలిపాఠాలు నేర్చుకున్నాను. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు నిర్వర్తించే విధులపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత సబ్‌కలెక్టర్‌గా ఏడాది పాటు పనిచేశాను. 2020లో నిజాంపేట్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాను. తాజాగా జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు సైతం అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ఈ మూడే విజయానికి సోపానాలు...
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రియేటివిటీ ఎక్కువ. పట్టణవాసులతో పోలిస్తే గెలవాలన్న తపన పల్లె జనాల్లోనే అధికం. ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని పరిశీలిస్తే సగానికిపైగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారే.. మొదట పల్లెటూరి వాళ్లమనే భావన దూరం చేసుకుంటే గమ్యం చేరుకోవడం సులభం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళిక ఈ మూడే విజయానికి సోపానాలు.
నా స్ఫూర్తి వీరే...
వెటర్నరీ సర్జన్‌గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న తీరు చూసిన స్నేహితులు ఐఏఎస్ అయితే మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని స్నేహితులు ప్రోత్సహించారు. వారు యూపీఎస్‌సీ రాసి విజయం సాధించడంతో నన్ను తరచూ గైడ్ చేస్తుండేవారు. ఏనాడూ కోచింగ్ సెంటర్‌కు వెళ్లలేదు. అవసరమైన మెటీరియల్‌ను సేకరించి చదువుకునేవాడిని. రెండుసార్లు సివిల్స్ రాశా. ఇంటర్వూ్య వరకు వెళ్లినా ఉద్యోగం రాలేదు. 2016లో మూడోసారి ర్యాంకు ఆధారంగా అవకాశం వచ్చింది.
0 Comments:
Post a Comment