✍️సీపీఎస్ పై నిర్ణయం?
♦రద్దు చేయాలంటున్న ఉద్యోగులు
♦సీఎం కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలుపు.. నేడు ఆందోళన
♦సచివాలయంలో నేడు సంప్రదింపుల కమిటీ భేటీ
♦మమ్మల్ని పిలవకుండా ఎవరితో చర్చిస్తారు.. ఉద్యోగ సంఘాల ఆగ్రహం
🌻అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ సచివాలయంలో.. సోమవారం సీపీఎస్ వ్యవహారంపై సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది. సీపీఎస్ రద్దు చేయాలని యూటీఎఫ్ సీఎం కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపు నిచ్చిన నేపథ్యంలో నేడు జరిగే సమావేశం కీలకం కానుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు నోటీసులు పంపింది. అయితే ఇప్పటికే రెండు సార్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వివిధ కారణాలతో వాయిదా వేశారు. అయితే సమావేశం నిర్వహణపై సీపీఎస్ ఉద్యోగ సంఘాలనుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా సీపీఎస్ ఉద్యోగుల సమస్యలపై చర్చించేటప్పుడు సీపీఎస్ ఉద్యోగులు లేకుండా సీపీఎస్ పై చర్చలా..? అని ప్రశ్నిస్తున్నారు.
♦సీపీఎస్ పై పూర్వాపరాలు పరిశీలిస్తే....
కమిటీలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1నుంచి సీపీఎస్ అమలుచేస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తెదేపా హయాంలో 2018 డిసెంబరు లో టక్కర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చించి నివేదిక సమర్పించింది. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రుల కమిటీ ఏర్పాటైంది. సీపీఎస్ రద్దు తప్ప మరో దానికి అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు తొలినుంచి పట్టు బడుతున్నాయి. ఆందోళనలు చేస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపట్టాయి. సీపీఎస్ రద్దుకు ఢిల్లీ శాసనసభ తీర్మానించింది. ఎన్నో రాష్ట్రాలు పునరాలోచిస్తుండగా, ఎన్నికల హామీ. మేనిఫెస్టోలో ఉన్నా ప్రస్తుతం సాగదీతే కొనసాగుతోంది. రాష్ట్రంలో 1.90లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తయితే వారిసంఖ్య 3లక్షలకుపైగా చేరుతుంది. అధికారంలోకి వచ్చిన వారంలోగా కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) రద్దు చేస్తానని హామీనిచ్చిన సీఎం జగన్ ఇంతవరకు అమలు చేయలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తామనే ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోలోనూ చేర్చారు. ఈ హామీని ఉద్యోగులు నమ్మారు. మూడేళ్లు గడుస్తున్నా చర్చలు. కమిటీల దశలోనే ఈ హామీ మిగిలింది. 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీ. అదే ఏడాది నవంబరు 27న అధికారుల కమిటీని ఏర్పాటుచేశారు. ఇవి తప్ప ఇంతవరకు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా మార్చి 31 లోపు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని సీఎం జగన్ స్వయంగా చెప్పినా కార్యరూపం కనిపించడం లేదు. సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏర్పాటుచేసిన సమావేశాలను ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా వేశారు. సోమవారం మరలా నిర్వహించనున్నారు. ఈ చర్చలకు సీపీఎస్ ఉద్యోగ సంఘాలను మాత్రం ఆహ్వానించలేదు. పాత పింఛనుతోనే దన్నుపాత పింఛను విధానం ఉద్యోగులకు భరోసానిస్తుంది. పింఛను పొందడానికి వారు కంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లింపు ఉండదు. ఉద్యోగులు ప్రతి నెలా పీఎఫ్ కొంత జమచేస్తారు. దీనిపై ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. పదవీ విరమణ తర్వాత పింఛను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. డీఏ పెరిగినప్పుడు, పీఆర్సీ అమలు చేసినప్పుడు పింఛను పెరుగుతుంది. సీపీఎస్ విధానంలో పింఛను ఫండ్ ఏర్పడినప్పటికీ ప్రభుత్వ అజమాయిషీలో ఉండదు. ప్రభుత్వం, ఉద్యోగులు వాటా చెల్లించాలి. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి భద్రతను బీమా -కంపెనీలకు, యాన్యుటీ ప్రొవైడర్లకు బదలాయిస్తారు. ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు వర్తించవు. పింఛను పెంపు ఉండదు. సీపీఎస్ రద్దు కోరుతూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18నుంచి 'పోరుగర్జన బైక్ ర్యాలీ' చేపడుతోంది. 25న విజయవాడలో రాష్ట్రస్థాయి భారీ ర్యాలీ నిర్వహించనుంది. పథకం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు1న ఏపీసీపీఎస్ ఉద్యోగ సంఘాలు రణభేరికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికేవారు పలుమార్లు ఆందోళన లు, ధర్నాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరుగనున్న సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో నని సీపీఎస్ ఉద్యోగులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సమావేశం పై సీపీఎస్ ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
0 Comments:
Post a Comment