Corona XE Variant: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం.. ముంబైలో తొలి కేసు నమోదు..
దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రకాల ఆంక్షలు కూడా తొలగిపోయాయి.
కానీ ఇప్పుడు కరోనాకు సంబంధించిన రెండు కొత్త వేరియంట్‌లు ముంబైలో నమోదయ్యాయి. ముంబయిలో ఓ రోగిలో కాపా వేరియంట్‌ను వైద్యులు కనుగొనగా.. మరొకరికి ఒమిక్రాన్ వేరియంట్ 'XE' సోకినట్లు గుర్తించారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. యూకేలో జనవరి 19న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇతర వేరియంట్ల కంటే ఇది 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
సుమారు రెండేళ్ల కిందట మన అంతు చూడటానికన్నట్టుగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్(Corona Virus) ఓ పట్టాన కట్టడి కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సరికొత్త రూపాలతో మళ్లీ మళ్లీ మనల్ని పట్టి పీడిస్తోంది. ఇక కరోనా దాదాపుగా ఖతమయ్యిందనుకున్నాం. ఇక ముప్పు తప్పినట్టేనని సంబరపడ్డాం. కరోనా నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదనుకున్నాం. హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న తరుణంలో కొత్త కోవిడ్ వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటికే చైనా(China)ను హడలెత్తిస్తోన్న ఆ కోవిడ్ వేరియంట్ బ్రిటన్‌ను కూడా గడగడలాడిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)లో సరికొత్త సబ్ వేరియంట్ అయిన ఈ వైరస్‌కు చాలా చాలా ప్రమాదకారి అని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా కన్నా పది రెట్లు ముప్పువాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కరోనా వైరస్ పుట్టిన చైనాలోనే సరికొత్త కోవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. షాంఘై నగరం వైరస్‌తో భీతిల్లుతోంది. వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం ఏకంగా సైన్యాన్నే రంగంలోకి దించింది. ప్రస్తుతం షాంఘైలో రెండు వేల మంది సైనిక వైద్య సిబ్బంది, పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలు అహర్నిశలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు రెండున్నర కోట్ల మందికి ప్రభుత్వం సామూహిక కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్తగా వారం కిందట లాక్‌డౌన్ విధించినప్పటికీ వైరస్ శరవేగంతో వ్యాప్తి చెందుతోంది. మొన్న జనవరిలో బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు పదింతల శక్తితో ప్రపంచ ప్రజలపై విరుచుకుపడబోతున్నది. చైనాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈ వైరస్ అన్నంత పని చేసేలా ఉంది. సరికొత్త మ్యూటెంట్లతో అత్యంత వేగంగా విజృంభిస్తోన్న ఈ న్యూ వేరియంట్ యిప్పుడు చైనా ప్రజలను గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ముప్పు మరోమారు తప్పదని చైనా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లు బిఏ1, బిఏ2 నుంచి రూపాంతరం చెందిన ఈ వేరియంట్‌ని ఎక్స్‌ఈగా పేర్కొంటున్నారు. ముప్పేటా ముంచుకొస్తోన్న మహమ్మారి ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది.
0 Comments:
Post a Comment