Third class girls attempt to run away: మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు కుటుంబసభ్యులను, పోలీసులను, పాఠశాల సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టారు.
పాఠశాల ముగిశాక ఇంటికి చేరకకుండా పారిపోయేందుకు ప్లాన్ వేశారు. అయితే.. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, పోలీసులు అప్రమత్తం కావడంతో వెంటనే ఆచూకీ లభించింది. చివరకు ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్నకు.. ఆ ఇద్దరు బాలికలు చెప్పిన సమాధానంతో అంతా షాకయ్యారు. వనస్థలిపురం పోలీసులు (Vanasthalipuram) తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం క్రాంతిహిల్స్, హిల్కాలనీకి చెందిన 9, 10 ఏళ్ల ఇద్దరు బాలికలు రెడ్ట్యాంకు వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. నిత్యం ఆటోలో బడికెళ్లి ఇంటికి వస్తుంటారు. అదే ఆటోలో ఓ విద్యార్థిని సోదరుడూ కూడా వస్తుంటాడు. అయితే.. పాఠశాల వదిలాక బాలిక, ఆమె సోదరుడు ఆటోలో.. మరో బాలిక తన కుటుంబసభ్యులతో రోజూ ఇంటికి వెళుతుంటారు.
అయితే.. సోమవారం యథావిధిగా ఉదయం 11.30 గంటలకు వారిద్దరి కోసం.. ఓ బాలిక సోదరుడు, మరో బాలిక తండ్రి ఎదురుచూస్తున్నాడు. అరగంట గడిచినా బాలికలిద్దరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్, బాలిక తండ్రి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అయితే.. పాఠశాల నుంచి వెళ్లిపోయారని సమాధానం చెప్పారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం.. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించింది. ఇద్దరు విద్యార్థినులు నడుచుకుంటూ రెడ్ట్యాంకు వైపు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అక్కడ వెతికినా ఇద్దరు బాలికల ఆచూకీ లభించకపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యులు, పాఠశాల సిబ్బంది, పోలీసులు అంతా కలిసి వారి కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో బాలికల స్నేహితుడిని విచారించగా.. వారు పారిపోయేందుకు మూడు రోజులుగా ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పాడు. సుష్మా రోడ్డు వైపు వెళ్తున్నామని వెళ్లేటప్పుడు చెప్పారని తెలిపాడు. దీంతో అక్కడికి వెళ్లి వెతకగా.. బాలికలిద్దరూ బస్ స్టాపులో కనిపించారు. దీంతో వారిని పాఠశాలకు తీసుకొచ్చి ప్రశ్నించారు. హిందీ పరీక్ష సరిగా రాయలేదని.. దీంతో తల్లిదండ్రులు తమని హాస్టల్లో చేరుస్తారన్న భయంతో పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు బాలికలు తెలిపారు.
0 Comments:
Post a Comment