✍️ఉపాధ్యాయులపై నిర్బంధకాండ
♦ఎక్కడికక్కడ నిర్బంధాలు..
♦సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలుపు
🌻ఈనాడు, అమరావతి, యంత్రాంగం: సీపీఎస్ రద్దు కోరుతూ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానితోపాటు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం, మరికొన్ని ఇతర సంఘాలకు చెందిన ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి, పోలీసుస్టేషన్లకు తరలించారు. విజయవాడకు వెళ్లేందుకు, సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిలో పాల్గొనేందుకు వీల్లేదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నోటీసులిచ్చారు. ఉపాధ్యాయుల్ని బయటకు రానీయకుండా గృహ నిర్బంధం చేశారు. కొన్నిచోట్ల పోలీసులు ఏకంగా తరగతి గదుల్లోకే వెళ్లి ఉపాధ్యాయుల్ని బయటకు వెళ్లనీయకుండా కాపలా ఉన్నారు. మరికొన్నిచోట్ల ముఖ్య నాయకుల్ని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి రోజంతా అక్కడే ఉంచారు. విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయాన్ని పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరగనీయకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అణచివేత చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీనీ ఇంటి నుంచి కదలకుండా అడ్డుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డిని సెల్లార్లో నిర్బంధించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి ప్రసాద్‌ను విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం నుంచి బయటికి రాకుండా కట్టుదిట్టం చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు.. ఉపాధ్యాయులు, సంఘాల నాయకుల ఇళ్ల వద్ద మోహరించారు. ఆదివారం తెల్లవారుజామున వారిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించి, నోటీసులిచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 70 మంది యూటీఎఫ్ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి, సమీప స్టేషన్లకు తరలించారు. దీనికి నిరసనగా బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనలు జరిగాయి.
* యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప సహా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 157 మందిని శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి విడిచిపెట్టారు.
* శ్రీకాకుళం జిల్లాలో 200 మంది యూటీఎఫ్ నేతల్ని పోలీసులు శనివారం రాత్రి నుంచే ఇళ్లలో నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు.
* ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, వట్టిచెరుకూరు, పెదకాకాని, గుంటూరు నగరాల్లో ఉపాధ్యాయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని యూటీఎఫ్ నాయకులను ఆదివారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నోటీసులిచ్చారు.
♦ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా..
తిరుపతి, చిత్తూరు జిల్లాల యూటీఎఫ్, సీపీఎస్ ఉద్యోగ సంఘం నాయకులకు శనివారం అర్ధరాత్రి నుంచే నోటీసులిచ్చారు. సుమారు 300 మందిని ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. మరికొందరిని స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించి.. నోటీసులిచ్చి సంతకాలు తీసుకున్నారు. పోలీసు నిర్బంధాలను ముందుగానే ఊహించిన కొందరు నాయకులు శనివారమే వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారు. చిత్తూరులో అలా బయటపడిన నాయకుడి ఇంటికి పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత మూడుసార్లు వెళ్లి ఆచూకీ అడగడంతో వారు ఇబ్బందులు పడ్డారు. పుత్తూరులో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సెలర్ దాసరి మునయ్యకు శనివారం అర్ధరాత్రి 12 గంటలకు నోటీసులు ఇచ్చారు. తిరుపతి జిల్లా తొట్టంబేడులో సచివాలయ మహిళా పోలీసులను సైతం యూటీఎఫ్ నాయకుల ఇళ్ల వద్ద కాపలా పెట్టారు.
♦రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జీల్లో తనిఖీలు
విజయవాడకు ఉపాధ్యాయులు ఎవరూ రాకుండా దారి పొడవునా పోలీసులు అడ్డుకున్నారు. ముట్టడికి వస్తున్న ఉపాధ్యాయుల్ని గుర్తించి, పోలీసుస్టేషన్‌కు తరలించారు. పాయకరావుపేట సమీపంలో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై పోలీసు పికెట్ పెట్టారు. విజయవాడ, రాజమహేంద్రవరం వైపు వచ్చే బస్సులు, కార్లను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులైతే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఉమ్మడి విశాఖ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు గొంది చిన్నబ్బాయి, ఉపాధ్యాయుడు ప్రకాష్ కారులో విజయవాడలో బయలుదేరగా పోలీసులు దారిలోనే అడ్డుకుని చోడవరం స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో హోటళ్లు, లాడ్జీలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భీమవరంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి ఇంటి ముందు పోలీసులు గస్తీ కాయడంతో ఆయన ఇంటి వెనుక ఇనుప గ్రిల్స్, ప్రహరీని దాటుకుని బయటపడి విజయవాడకు పయనమయ్యారు.
♦మీకు అనుమతులు.. మాకు అడ్డంకులా!
ఇదెక్కడి న్యాయం?: ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు
అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రతిపక్షంలో ఉండగా మీ పాదయాత్రకు, ధర్నాలకు అనుమతులు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చేసరికి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారేమని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సీఎం జగన్‌ను ప్రశ్నించారు. పోరుగర్జనకు వెళ్లేందుకు సిద్ధమైన ఐవీని ఆదివారం ఉదయం అమలాపురంలో గృహనిర్బంధం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులతో కలిసి నినాదాలు చేస్తూ గడియారస్తంభం కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. వారిని పోలీసులు ఆటోల్లో స్టేషన్‌కు తరలించారు. అరెస్టుచేసిన 36 మంది ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అంబాజీపేట, పట్టణ పోలీసుస్టేషన్లకు తరలించారు.
♦నిద్ర లేచేసరికే.. ఇంటి వద్ద కానిస్టేబుల్!
తొండంగి, న్యూస్‌టుడే: సీఎంవో ముట్టడికి వెళ్లనీయకుండా కాకినాడ జిల్లా తొండంగి మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి.సత్తిబాబును పోలీసులు పంపాదిపేటలో గృహనిర్బంధం చేశారు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఆయన నిద్ర లేచేసరికే ఇంటి వద్దకు కానిస్టేబుల్ వచ్చేశారు.
♦నమాజ్‌కు సైతం వెళ్లనీయకుండా..
ఈనాడు డిజిటల్, చిత్తూరు: సాయంత్రం 6.30 గంటలైనా నమాజ్ కోసం మసీదుకు వెళ్లనీయకుండా తనను అడ్డుకున్నారని చిత్తూరు జిల్లా సీపీఎస్ ఉద్యోగ సంఘం నేత ఎస్పీ బాషా ధ్వజమెత్తారు. ఆదివారం ఉదయం ఆయన్ను ఒకటో పట్టణ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. కొంతసేపటి తర్వాత విడిచిపెట్టారు. అనంతరం గృహనిర్బంధంలో ఉంచారు.
♦బడికొచ్చినా పోలీసు నిర్బంధమే
బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శశికుమార్‌ను శనివారం సాయంత్రం నుంచి పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని బడికి వచ్చినా అక్కడా వెంటే ఉన్నారు.
0 Comments:
Post a Comment