✍️విద్యాశాఖలో వినూత్న మార్పులు
*🌻ఒంగోలు నగరం, న్యూస్‌టుడే*: జిల్లాల విభజన అనంతరం విద్యాశాఖలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న సమగ్రశిక్ష, వయోజన విద్య విభాగాలను డీఈవో కార్యాలయంలో విలీనం చేయనున్నారు. సిబ్బంది వివరాలు కోరగా జిల్లా నుంచి రెండు రోజుల క్రితం పంపించారు. కొన్ని పాఠశాలలు బాపట్ల, మరికొన్ని నెల్లూరు జిల్లాలో చేరాయి. బాపట్లలో కొత్తగా డీఈవోని నియమించారు. సమగ్రశిక్ష త్వరలో విలీనం కానున్నందున ఏపీసీ పోస్టులో ఎవరినీ నియమించకుండా ప్రకాశం జిల్లా ఏపీసీకే ఇన్‌ఛార్జి బాధ్యత అప్పగించారు.
*♦ఒకే భవనంలో ఏర్పాటు:* ఇప్పటివరకు ప్రాథమిక విద్య అమలు, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల సర్వీసు, ప్రైవేటు పాఠశాలల అనుమతులు, పర్యవేక్షణ వంటి వాటిని డీఈవో కార్యాలయం పర్యవేక్షిస్తుంది. సమగ్రశిక్ష పరిధిలో ఉపాధ్యాయుల శిక్షణ, కేజీబీవీలు, విద్యార్థులకు వస్తువుల పంపిణీ, దివ్యాంగుల విద్య అంశాలు ఉన్నాయి. దీంతో సిబ్బంది లేక ఉపాధ్యాయులను సెక్టోరల్ అధికారులుగా నియమించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం టీచర్లను బోధనేతర పనులకు వినియోగించకూడదు. ఈ సమస్య దృష్ట్యా సమగ్రశిక్షను ఎత్తివేసి డీఈవో పరిధిలోకి తీసుకురానున్నారు. అదే విధంగా వయోజన విద్యలో టీచర్లు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. ఈ కార్యాలయాన్ని డీఈవో పరిధిలోకి తెస్తే ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. ఏపీసీ బి.శ్రీనివాసరావును సమాచారం కోరగా అన్నింటిని ఒకే భవనంలో నడపాలని ఉత్తర్వులిచ్చారన్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాఠశాలలు, సిబ్బందిని విభజించారు. ఈ ఏడాదికి పరీక్షలు ఉమ్మడి జిల్లా కిందనే నిర్వహిస్తారు
0 Comments:
Post a Comment