✍️జీతాలు ఎప్పటికి వచ్చేనో?
♦అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు సతమతం
🌻జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే:
అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు జీతాలు ఎప్పుడు వచ్చేనో? అని ఎదురు చూపులు చూస్తున్నారు. మార్చి నెలకు సంబంధించి జీతాలు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత కొంత కాలంగా ఏ నెలకు సంబంధించి జీతాలు ఆ నెలలో విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో 1వ తేదీన జీతం వస్తుందని భావిస్తుంటారు. అప్పటి నుంచే చెల్లింపులు చెల్లించాలంటూ వస్తున్న వారికి సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. పాల బిల్లు, విద్యుత్తు, కిరాణా సరకులు తెచ్చుకున్న పచారీ షాపు వాళ్లు, పిల్లలకు పాఠశాల, కళాశాలల్లో ఫీజులు ఇలా చెబుతూ పోతే నెల వారీ ఖర్చులు చెల్లించాలి. మార్చి జీతం ఏప్రిల్ నెలలో 19వ తేదీ నాటికి కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకపోవడంతో చెల్లింపులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 18 అండేడ్కర్ గురుకులాల్లోని ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఉద్యోగులు జీతాల కోసం సీఎఫ్ఎంఎస్ ఖాతాను తెరచి చూస్తుంటే ‘సున్నా’ నిధులు చూపుతుంది. ప్రభుత్వం నిధులు డిపాజిట్ చేయకపోవడంతో ఉద్యోగులకు జీతాలు విడుదల చేయలేని పరిస్థితి. ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించి బిల్లులను ఈనెల 25న ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జీతాల గురించి ఉన్నతాధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఉద్యోగుల సంఘాల నాయకులు జీతాల గురించి అధికారులను అడుగుతున్నా ఎప్పుడు విడుదల అవుతాయో చెప్పలేని పరిస్థితి. ఒప్పంద ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు జీతాలు విడుదల కాకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పొరుగు సేవల ఉద్యోగులకు ప్రతి నెలలో 1, 2వ తేదీల్లో వేతనాలు జమయ్యేవి. మార్చి నెలకు సంబంధించి వారికి కూడా జీతాలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు.
* జిల్లాల పునర్విభజనతో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలను రద్దు చేశారు. దీంతో ఉద్యోగులకు జీతాలు విడుదల కాలేదు. పీడీ ఖాతాలను తిరిగి ప్రారంభించిన తర్వాత గానీ వీరికి వేతనాలు చెల్లించడం సాధ్యం కాదు.
0 Comments:
Post a Comment