సిబ్బంది కుదింపు - కలెక్టరేట్లలో సెక్షన్లు విలీనం
పెరగనున్న పనిభారం - ఆందోళనలో రెవెన్యూ ఉద్యోగులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు నేపథ్యంలో కలెక్టరేట్లలో ఎ నుంచి హెచ్ వరకు ఉన్న ఎనిమిది సెక్షన్లను నాలుగు సెక్షన్లుగా కుదించారు.
కొత్త జిల్లాలకు ఉద్యోగులను సమానంగా సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెక్షన్ల విలీనం వల్ల పనిభారం పెరుగుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అమలవుతున్న విధానంలో ఒక్కో సెక్షన్‌కు ఆరు నుంచి ఎనిమిది మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫైల్స్ సత్వర పరిష్కారం పేరుతో పలు ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై ఒకరిద్దరు డిప్యూటీ తహశీల్దార్లు వేర్వేరు బాధ్యతల్లో ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో 13 జిల్లాల్లో సుమారు 105 నుంచి 125 మంది వరకు సిబ్బంది తగ్గిపోవడంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరగనుంది. ప్రభుత్వం తాజాగా పేర్కొన్న మార్పుల ప్రకారం కలెక్టరేట్లలో ఎ సెక్షన్ కింద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆఫీసు నిర్వహణ సర్వీసు మ్యాటర్, ఉద్యోగుల డిసిప్లినరీ యాక్షన్, ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగుల సర్వీసులు ఉండేవి. బి సెక్షన్లో అకౌంట్స్ అండ్ ఆడిటింగ్, జీత భత్యాలు, కొనుగోలు, రికార్డుల నిర్వహణ చేపట్టేవారు. ఈ రెండు సెక్షన్లను ఒకే సెక్షన్ కిందకు చేర్చి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ (అడ్మిన్) చేశారు. బి, ఇ, జి సెక్షన్లలో భూములకు సంబంధించి పాలనా వ్యవహారాలు, అసైన్మెంట్ భూములు, ఇంటి పట్టాలు, నిషేధిత భూములు 22ఎ, రిజిస్ట్రేషన్ యాక్ట్, మత్స్యశాఖతో పాటు భూముల క్రమబద్ధీకరణ, ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్-1948, ఇనామ్ అబాలిషన్ యాక్ట్, కోర్టు కేసులు, పరువునష్టం దావాల ఫాలోఅప్‌లు, ఫారెస్ట్ సెటిల్మెంట్ యాక్ట్, భూముల సేకరణ, ఆర్అండ్ఆర్ వంటి వాటిని పరిశీలించేవారు. తాజాగా ఆ మూడు సెక్షన్లను కలిపి ల్యాండ్ మ్యాటర్స్ సెక్షన్ (ల్యాండ్) పేరుతో ఒకే సెక్షన్ చేశారు. సి సెక్షన్ కింద న్యాయపరమైన అంశాలు, సినిమాటోగ్రఫీ, కుల సర్టిఫికెట్ల పరిశీలన, అగ్నిప్రమాదాలు, భద్రత, లా అండ్ ఆర్డర్, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులతోపాటు లోకాయుక్త, హెచ్ఆర్సి, ఎన్హెచ్ఆర్సి, ఆర్టిఐ తదితర అంశాలుండేవి. డి సెక్షన్ కింద భూములు, పరిహారాలు, హెచ్ సెక్షన్ ప్రొటోకాల్, ఎన్నికల అంశాలతో పాటు ప్రకృతి విపత్తులు, వాటర్ ట్యాక్స్, నాలా, రీ సర్వే, వెబ్‌ల్యాండ్ సమస్యలు, ఆర్‌ఒఆర్, భూ రికార్డులు కంప్యూటీకరణ, ఇ-గవర్నెర్స్, ఓటర్ల నమోదు, ప్రొటోకాల్, స్పందన అర్జీలు, ఇతర సెక్షన్లకు సహకరించడం లాంటి విధులు నిర్వహించేవారు. ఈ రెండు విభాగాలను కలిపి కో-ఆర్డినేషన్ సెక్షన్ (ఆర్‌ఒఆర్) రిలీఫ్, ప్రొటోకాల్, ఎలక్షన్స్, అత్యవసర సేవల కింద ఒకే సెక్షన్‌గా మార్చారు. సెక్షన్ల కుదింపుతో ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment