భూగర్భ విద్యుత్తు వ్యవస్థతో సమస్యలకు పరిష్కారం
రాష్ట్రంలోనే ఇది ప్రథమం..
ఒంగోలు నగరంలో భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ప్రారంభిస్తున్న
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్‌కుమార్, తదితరులు
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రానున్న రెండేళ్లలో ఒంగోలులో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
నగరంలో రూ.56.74 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన డబుల్ సర్క్యూట్ భూగర్భ విద్యుత్తు సరఫరా వ్యవస్థను కర్నూలురోడ్డులోని ట్రాన్స్‌కో ప్రాంగణంలో బుధవారం ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఇది ప్రథమమని తెలిపారు. మరో రూ.28 కోట్లతో వెంకటేశ్వరకాలనీ వద్ద ఏర్పాటు చేయనున్న భూగర్భ కేబుల్ విద్యుత్తు లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంగమూరు రోడ్డు కూడలిలో ఫైలాన్‌ను ఆవిష్కరించారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా హైటెన్షన్ విద్యుత్తు తీగలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారమైందన్నారు. 33, 34, 35, 36 డివిజన్ల వాసుల ఇబ్బందులు తొలగాయన్నారు. ఈనెల 15 నుంచి నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతానని ప్రకటించారు. పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు 25 శాతం జరిగాయని, మరో ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు. నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి రూ.409 కోట్లు మంజూరు చేశారని..టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారన్నారు. ప్రధాన రహదార్లలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా గ్రోత్‌సెంటర్‌లో ఐటీ కంపెనీని ఎన్ఆర్ఐ ఏర్పాటుచేశారని, త్వరలో ప్రారంభిస్తామన్నారు. స్థానికంగా 700 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎ.ఎన్.దినేష్‌కుమార్, సంయుక్త కలెక్టర్ జె.వి.మురళి, ట్రాన్స్‌కో జేఎండీ మల్లారెడ్డి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, ఇన్‌ఛార్జి కమిషనర్ సుందరరామిరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అర్హులకు పట్టాలు
నగరంలో 24 వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించడానికి యరజర్ల వద్ద స్థల సేకరణకు ప్రయత్నిస్తే దానిపై తెదేపా నేతలు కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకున్నారన్నారు. త్వరలో అది పరిష్కారం అవుతుందని, అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామన్నారు.
0 Comments:
Post a Comment