యూజర్లకు ట్రూ కాలర్ షాక్.. ఆ ఫీచర్ తొలగింపు!
గూగుల్ విధించిన కొత్త నిబంధనల ఫలితంగా ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూ కాలర్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లకు ఫ్రీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్‌ను తొలగిస్తామని ట్రూకాలర్ ప్రకటించింది. మే 11 నుంచి ఈ నిర్ణయం అమలు అవుతుందని వెల్లడించింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గూగుల్ విధించిన, అమలు చేయనున్న కొత్త నిబంధనలే కారణమని తెలుస్తోంది. ఏదేమైనా ట్రూకాలర్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. కీలకమైన ఫీచర్ తొలగింపుతో పెదవి విరుస్తున్నారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయడానికి గూగుల్ నిర్ణయించింది. ముఖ్యంగా కాల్ రికార్డింగ్ విషయంలో నిబంధనలు మార్చినట్లు వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ ఆప్షన్ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో మే 11 నుంచి కాల్ రికార్డింగ్ యాప్‌లు కనిపించవు. అంతేకాకుండా ఆండ్రాయిడ్‌లో ఇప్పటికే ఇన్‌బిల్ట్ అయిన యాప్‌లలో కాల్ రికార్డింగ్ ఆప్షన్ కనిపించదు. ఒకవేళ యూజర్లు కాల్ రికార్డింగ్ చేయాలనుకుంటే వారు వినియోగించే ఫోన్లలో ఉండే కాల్ రికార్డింగ్ ఆప్షన్‌పైనే ఆధార పడాల్సి ఉంటుంది. ఒక వేళ ఫోన్లలో ఈ ఆప్షన్ లేకపోతే కాల్ రికార్డింగ్ చేసే వెసులుబాటు ఉండదు. గూగుల్ కొత్త ప్రోగ్రామ్స్ కారణంగా తమ యాప్‌లోని కాల్ రికార్డింగ్ ఆప్షన్ తొలగిస్తున్నట్లు ట్రూకాలర్ వెల్లడించింది.
కాల్ రికార్డింగ్ యాప్స్‌పై తొలి నుంచీ గూగుల్‌కు సదభిప్రాయం లేదు. యూజర్ల గోప్యత, భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ తాజాగా నిర్ణయించింది. కాల్ రికార్డింగ్ కోసం యాప్‌లకు గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐ అవసరం పడుతుంది. దీనిని గూగుల్ తొలగించనుంది. దీంతో థర్డ్ పార్టీ యాప్‌లు ఇక నుంచి ఏపీఐ యాక్సెసబిలిటీ పొందలేవు. ఫలితంగా ఆ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఇప్పటికే శాంసంగ్, ఎంఐ, వివో వంటి ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం లేని వారికి మాత్రమే కొంత సమస్య ఎదురవుతుంది.
0 Comments:
Post a Comment