✍️అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే - సుప్రీంకోర్టు కీలక తీర్పు
🌻ఈనాడు, దిల్లీ: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గ్రాట్యుటీ చట్టం-1972 కింద గ్రాట్యుటీ పొందడానికి అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గుజరాత్ హైకోర్టు డివిజన్ ధర్మాసనం తీర్పును సవాలుచేస్తూ దాఖలైన అప్పీళ్లను అనుమతించింది. ‘‘1972 గ్రాట్యుటీ చట్టం కింద అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రయోజనం కల్పించేలా గుజరాత్ అధికారులు మూడు నెలల్లోపు చర్యలు తీసుకోవాలి. ఆ చట్టంలోని సెక్షన్ 7 (3-ఎ) కింద పేర్కొన్న తేదీ నుంచి 10% వార్షిక వడ్డీతో అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు అందరికీ ఈ ప్రయోజనం కల్పించాలి’’ అని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిశ్రమ కిందకు రాదు కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 2(ఇ) కింద ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని, వారికి చెల్లిస్తున్న గౌరవ వేతనాలను సాధారణ జీతాల కింద పరిగణించడానికి వీల్లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. దానిని సవాలుచేస్తూ దాఖలైన అప్పీళ్లను సుప్రీంకోర్టు అనుమతిస్తూ ఈ ఉద్యోగులు గ్రాట్యుటీ పొందడానికి అర్హులేనని స్పష్టంచేసింది. ‘‘విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు చట్టబద్ధమైన విధులు నిర్వర్తిస్తున్నట్లే. ఈ కేంద్రాలు గ్రాట్యుటీ చట్టం 1972లోని సెక్షన్ 3కింద ఏర్పాటైన సంస్థల అర్థం పరిధిలోకే వస్తాయి. అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంతర్భాగమే. ఈ కేంద్రాలన్నీ 1972 గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 1, సబ్ సెక్షన్ 3, క్లాజ్-బీ కిందికే వస్తాయి. అంగన్వాడీ కార్యకర్తలకు చెల్లించే గౌరవ వేతనం కూడా వేతన నిర్వచనం పరిధిలోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలను గ్రాట్యుటీ పరిధిలోకి వచ్చే సంస్థలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూల్ విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాలు కూడా పూర్తిగా విద్యా కార్యకలాపాలు సాగిస్తున్నట్లే లెక్క. బోధనా బాధ్యతలను ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 11 కిందే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్ నిర్వహిస్తున్నందున వారికి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 నిస్సందేహంగా వర్తిస్తుంది’’ అని ఈ తీర్పు రాసిన జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ స్పష్టంచేశారు.
0 Comments:
Post a Comment