🔳విద్యాశాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులు
ఎయిడెడ్ లెక్చరర్ల విలీనం కోసం నిర్ణయం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు వీలుగా విద్యాశాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల విలీనం, ఆయా కళాశాలల్లోని సిబ్బంది విలీనానికి గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిపై వ్యతిరేకత రావడంతో ఇష్టం ఉన్న విద్యాసంస్థలు, సిబ్బందే విలీనం కావొచ్చంటూ సవరణ ఉత్తర్వులు జారీచేసింది. దీనిలో భాగంగా 125 ఎయిడెడ్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలు తమ దగ్గర పనిచేస్తున్న 895 మంది బోధన సిబ్బంది, 1,120 బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించాయి. దీంతో వారంతా ప్రభుత్వానికి జాయినింగ్ లేఖలు ఇచ్చారు. అయితే, ఇలా విలీనమైన సిబ్బందికి ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న ఖాళీల మేరకు పోస్టింగ్‌లు కల్పించారు.
ఖాళీలు లేకపోవడంతో 23 మంది ప్రిన్సిపాళ్లు, 31 మంది లెక్చరర్లు, 199 మంది బోధనేతర సిబ్బందికి పోస్టింగ్‌లు ఇవ్వలేకపోయారు. వీరికి కూడా ప్రభుత్వ కళాశాలల్లో పోస్టింగులు ఇచ్చేలా సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు ఎయిడెడ్ కళాశాలల్లోని బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్ కోర్సులు తదితర వివరాలను పంపాలంటూ ప్రాంతీయ విద్యాశాఖాధికారులను కళాశాల విద్య కమిషనరేట్ జాయింట్ డైరక్టర్ డేవిడ్ కుమారస్వామి ఆదేశించారు.
అంతర్‌జిల్లాల బదిలీకి అనుమతిప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్ల అంతర్ జిల్లాల బదిలీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తుండడం, అదేవిధంగా పరస్పర అంగీకారంతో అంతర్ జిల్లాల బదిలీలు చేసేందుకు మార్గం సుగమం చేసింది. ఈ కారణాలతో మొత్తం 527 మంది అంతర్‌జిల్లాల బదిలీల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. వారిని బదిలీ చేసేందుకు అనుమతిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ బుఽధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
0 Comments:
Post a Comment