హెచ్ .యం, టీచర్ల పని తీరు బాలేదు. పెదవి విరచిన విద్యా శాఖ
పనితీరు బాలేదు సారూ!
టీచర్లు, హెచ్‌ఎంల పనితీరుపై విద్యాశాఖ పెదవి విరుపు
హెడ్‌మాస్టర్లు ముందు వచ్చి ఆలస్యంగా వెళ్లాలి
మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు..వారి బాధ్యతే
ఏటా క్లాస్ ప్రణాళికను టీచర్లు సిద్ధంచేసుకోవాలి
కరెంటు అఫైర్స్, డిజిటల్ కంటెంటు ఉండాలి
టీచర్లు, బడుల పనితీరుపై సర్కారు మదింపు
రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ విధులను, తమకు నిర్దేశించిన బాధ్యతలను సరిగా నిర్వహించడం లేదని విద్యాశాఖ తేల్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని పేర్కొంది. పాఠశాల విద్యలో ఏ సంస్కరణ అయినా క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే ఉపాధ్యాయులతోనే అది సాధ్యమని, కానీ ఆ దిశగా కొందరు పనిచేయడం లేదని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఇతర విద్యారంగ ఉద్యోగులు తమ పనులను సక్రమంగా నిర్వహించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేశారు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్ర పాఠశాల విద్య రూపొందించిన పలు విధివిధానాలకు సంబంధించిన ఈ సర్క్యులర్‌ను మంగళవారం జారీచేశారు. దీని ప్రకారం... ఇకనుంచి ఏటా తరగతి పాఠ్యప్రణాళిక రూపొందించాల్సిందే.
ఉపాధ్యాయులు ఏటా తాము బోధించే తరగతులకు సంబంధించిన పాఠ్య ప్రణాళికను రూపొందించుకుంటారు. ఉదాహరణకు 2021-22లో పదో తరగతికి సోషల్ స్టడీస్ సబ్జెక్టును బోధిస్తున్న ఉపాధ్యాయులు..ఒక పాఠ్య ప్రణాళిక తయారుచేసుకున్నారు. 2022-23ఏడాదికి వచ్చేసరికి అప్పటివరకు జరిగిన తాజా పరిణామాలను జోడించే పద్ధతి ఉంది. అయితే ఇప్పటినుంచి అలా జోడించడం కాకుండా.. ఏటా కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవాల్సిందే. అది కూడా గత ఏడాదిది కాపీ చేసి మళ్లీ చేయడం కాకుండా...మారుతున్న కాలం, పరిణామాలు, నూతన అధ్యయన పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. ఉపాధ్యాయులు రూపొందించుకునే పాఠ్యప్రణాళికకు ప్రధానోపాధ్యాయుని నుంచి ఆమోదం తీసుకోవాలి. ప్రతి ఉపాధ్యాయుడూ తన పాఠ్య ప్రణాళిక పుస్తకంలో కరెంట్ అఫైర్స్, ఒక అంశానికి సంబంధించిన అప్‌డేటెడ్ సమాచారం చెప్పే పుస్తకం, ఆ సమాచారానికి సంబంధించిన తాజా డిజిటల్ సోర్సులను పొందుపరచాలి. మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఆ డిజిటల్ సోర్సులను విద్యార్థులకు కూడా ఇవ్వాలి.
టెక్నాలజీలో అప్‌డేట్...
హెడ్‌మాస్టర్లందరూ పాఠశాల సమయం కంటే పావుగంట ముందుగానే పాఠశాలకు రావాలి. సాయంత్రం విద్యార్థులంతా ఇళ్లకు బయల్దేరారని నిర్థారించుకున్నాకే ఇంటికి వెళ్లాలి. తాజా టెక్నాలజీలో తమనుతాము అప్‌డేట్ చేసుకోవాలి. సాంకేతికతను అలవర్చుకోవాలి. ఇక...ఉపాధ్యాయులు తరగతి గదుల్లో తమ సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసేలా గట్టిచర్యలు తీసుకోవాలి. 8వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. మధ్యాహ్న భోజనం, జేవీకే, పాఠశాల, మరుగుదొడ్ల పరిశుభ్రత కార్యక్రమాలను పర్యవేక్షించాలి. ప్రధానోపాధ్యాయులు రూపొందించుకున్న ప్రణాళికలను జిల్లా ఉప విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు అమలయ్యేలా చేస్తూ, అప్పుడప్పుడు పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొంటూ ఉండాలి. పాఠశాలల్లో ఒక మోడల్ క్లాస్‌రూమ్‌ను ఏర్పాటుచేసేలా పనిచేయాలి. ఇంకోవైపు ఎస్‌సీఈఆర్‌టీని పాఠశాల విద్య కోసం అకడమిక్ అథారిటీగా గుర్తించారు. బోధనా పద్ధతులు, వాటి వల్ల విద్యార్థుల్లో వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ...అవసరమైన మార్గదర్శకత్వం అందించాలి. రాష్ట్రంలోని విద్యార్థులందరూ వారు చదువుతున్న తరగతికి తగినట్లుగా సబ్జెక్టులను నేర్చుకుంటున్నారో లేదో చూడాల్సిన బాధ్యత ఆ వ్యవస్థపై ఉన్నదని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
0 Comments:
Post a Comment