జన్యుమార్పిడి దోమలు.. కోట్ల సంఖ్యలో సిద్ధం చేస్తోన్న కంపెనీ! త్వరలో జనాల్లోకి..! ఆ తరువాత ఏం జరుగుతుందో తెలిస్తే..
దోమల బెడదకు దోమలతోనే చెక్ పెట్టేందుకు సిద్ధమైంది ఓ బయోటెక్ కంపెనీ. అందుకోసం ఏకంగా కోట్ల సంఖ్యలో జన్యుమార్పిడి దోమల్ని సిద్ధం చేస్తోంది.
అవన్నీ మగ దోమలే! త్వరలో వీటిని కాలిఫోర్నియా రాష్ట్రంలో(అమెరికా) విడిచిపెడుతుందట. దీంతో.. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న దోమల సంతతి భారీగా తగ్గిపోతుందని చెబుతోంది ఆ కంపెనీ. ఇలాంటి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన ఆ కంపెనీ పేరు ఆక్సీటెక్.
దొమల బెడదకు చెక్ పెట్టేది ఎలాగంటే..
జన్యుమార్పిడి సాంకేతికత సాయంతో ఆక్సిటెక్ సిద్ధం చేసిన ఈ మగ దోమల్లో ఓ ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కారణంగా అవి కేవలం మగ దోమలకు మాత్రమే జన్మనివ్వగలవు. ఇవి.. సంతానోత్పత్తి కోసం సాధారణ మగ దోమలతో పోటీ పడుతూ ఆడ దోమలతో కలుస్తాయి. ఫలితంగా.. తరువాత తరంలో ఆడ దోమల కంటే మగ దోమల సంఖ్య పెరుగుతుంది. కొంత కాలం తరువాత.. ఆడ దోమల సంఖ్య భారీగా పడిపోయి చివరికి దోమలు ఆ ప్రాంతం నుంచి కనుమరుగైపోతాయి. జీకా, చికున్‌గున్యా, యెల్లో ఫీవర్ వంటి వ్యాధులకు కారణమయ్యే ఏడిస్ ఈజిప్టీ దోమలను అంతం చేసేందుకు ఆక్సీటెక్ ఈ ప్రాజెక్టు చేపట్టింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్టుకు అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ గత నెలలోనే అనుమతించింది. అయితే.. కాలిఫోర్నియా వాసులు ఈ ప్రాజెక్టును ప్రతిఘటిస్తుండటంతో కంపెనీ ప్లాన్ కార్యరూపం దాల్చేందుకు మరి కొంత సమయం పట్టేటట్టుంది. కొందరు శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ''ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారనే విషయంలో మరింత పారదర్శకత అవసరం. దీని వల్ల కలిగే లాభనష్టాలపై సమగ్రంగా అధ్యయనం చేశారా..?'' అని ఓ నిపుణుడు ప్రశ్నించారు.
''ఈ ప్రాజెక్టు గురించి మాతో చర్చించకుండా, మా అనుమతి తీసుకోకుండానే ముందుకెళుతున్నారు.. ఇది చాలా షాకింగ్'' అని స్థానికుడు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే.. ఆక్సీటెక్ ప్రాజెక్టుకు కాలిఫోర్నియా పెస్టిసైడ్ నియంత్రణ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంది. దోమల బెడదకు చెక్ పెట్టేందుకు వీలుగా ఈ కొత్త సాంకేతికతను అందరికీ అమెరికా వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ సీఈఓ గ్రే ఫ్రాండ్సన్ పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment