గంజాం డీఈఓపై దాడి
డీఈఓ బినితా సేనాపతికి ఎమ్కేసీజీ ఆసుపత్రిలో ఎక్స్‌రే తీస్తున్న సిబ్బంది
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) బినితా సేనాపతిపై మంగళవారం దాడి జరిగింది.
స్థానిక గిరిరోడ్డులోని డీఈఓ కార్యాలయం ఆవరణలో మధ్యాహ్నం ఆమె తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అప్పటికే అక్కడ వేచి ఉన్న ఓ ఉపాధ్యాయిని, ఆమె భర్త డీఈఓతో వాగ్వాదానికి దిగారు. హఠాత్తుగా ఉపాధ్యాయిని భర్త సేనాపతి ముఖంపై బలంగా కొట్టారు. కార్యాలయం సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బ్రహ్మపుర సబ్‌కలెక్టరు వి.కీర్తి వాసన్ హుటాహుటిన డీఈఓ కార్యాలయం చేరుకున్నారు.
ఆమెను చికిత్స నిమిత్తం ఎమ్కేసీజీ ఆసుపత్రికి తరలించారు. ముఖంపై తీవ్ర గాయమవగా, వైద్యులు ఎక్స్‌రే ఇతరత్రా పరీక్షలు చేపట్టారు. మరోవైపు టౌన్ ఠాణా పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బెల్లుగుంఠ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయిని వివిధ కారణాలతో రెండు నెలలకుపైగా డీఈఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేస్తున్నారు. మంగళవారం భర్తతో కలిసి కార్యాలయానికి వచ్చిన ఉపాధ్యాయిని సేనాపతితో మాట్లాడుతున్న సమయంలో ఆమె భర్త దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనకు నిరసనగా ఆ శాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది రాత్రి ఆందోళనకు దిగారు. డీఈవో కార్యాలయం బయట ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.
0 Comments:
Post a Comment