అమ్మ ఒడి కి మరో మెలిక..
నిన్నటి వరకూ నిబంధనల వడపోత
నేడు ఎన్పీసీఐ లింక్ అంటూ కొత్త పాట
ఎన్పీసీఐ ఖాతాలను గుర్తించలేక తల్లుల అగచాట్లు
బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు
'ఒక్కరికే' నిబంధనతో ఇప్పటికే 2.50 లక్షల మందికి అన్యాయం
తాజా నిబంధనలతో మరో లక్షమందికి ఎఫెక్ట్!
అమ్మఒడి పథకాన్ని పొందేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు చదువుతున్న పాఠశాల లేదా కళాశాలలో వారి బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చేవారు. వాటినే స్కూల్ లాగిన్‌లో నమోదు చేసేవారు. అమ్మఒడి డబ్బులు ఆ బ్యాంకు ఖాతాలోకే జమయ్యేవి... ఇది ఇప్పటి వరకూ కొనసాగిన పద్ధతి.
అమ్మఒడి పొందాలంటే బ్యాంకు ఖాతా ఇస్తే సరిపోదు. ఆ బ్యాంకు ఖాతా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కి అనుసంధానం(లింకు) అయిఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఖాతాను స్కూల్ లాగిన్‌లో నమోదు చేస్తారు. ఆ ఖాతాకే అమ్మఒడి డబ్బులు పడతాయి. ఒకవేళ పొరపాటున ఎన్‌పీసీఐకి అనుసంధానమై లేని బ్యాంకు ఖాతా ఇస్తే ఆ ఏడాది అమ్మఒడి లేనట్లే. ఇక నుంచి అన్ని పథకాలకు ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గుంటూరు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): కోతలు, ఏరివేతలతో ఒక్కో సంక్షేమ పథకాన్ని ప్రజలకు దూరం చేస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా అమ్మఒడిపై పడింది. వాస్తవానికి ఈ పథకం ప్రారంభానికి ముందే ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పింది. కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, పథకం అమలుకొచ్చేసరికి ఇంట్లో ఒకరికే అంటూ కోతపెట్టింది. ఫలితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2.6 లక్షల మంది విద్యార్థులు అమ్మఒడికి దూరమయ్యారు. జిల్లాలో ఉన్న 3,043 ప్రాథమిక పాఠశాలల్లో 1.20 లక్షల మంది, 772 ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో 95 వేల మంది, 1,200 జెడ్పీ హైస్కూళ్లలో 4.08 లక్షల మంది చిన్నారులు చదువుతున్నారు. వీరితోపాటు తొలి ఏడాది ఇంటర్ 42,000 మంది, రెండో ఏడాది ఇంటర్ 45,000 మంది వెరసి ఉమ్మడి జిల్లాలో 7,10,000 మంది చదువుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 4,53,000 మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చింది.
కోతలు.. వాయిదాలు..
సగం మందికే పథకాన్ని పరిమితం చేసినా అదికూడా సక్రమంగా ఇచ్చింది లేదు. తొలి ఏడాది అట్టహాసంగా రూ.15వేలు ఇచ్చి, మరుసటి ఏడాది స్కూలు అభివృద్ధి కోసం అంటూ అందులో రూ.1000 కోత పెట్టారు. ఆ మరుసటి విద్యాసంవత్సరానికి ఇవ్వాల్సిన అమ్మఒడిని జనవరి నుంచి జూన్‌కు వాయిదా వేశారు. ఫలితంగా కిందటి విద్యాసంవత్సరం విద్యార్థుల తల్లులకు అమ్మఒడి దక్కలేదు. ఇప్పుడు ఇచ్చేది ఏ విద్యా సంవత్సరానికి సంబంధించినదో ప్రభుత్వం చెప్పదు. విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియదు. దీంతోపాటు విద్యార్థులకు ల్యాప్‌టాప్ పథకమంటూ 'వన్‌టైమ్ సెటిల్మెంట్' పద్ధతిలో అమ్మఒడికి నీళ్లు వదిలే కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది. తాజాగా విద్యార్థులకు 75శాతం హాజరు ఉండాలని, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటకూడదని, తల్లిదండ్రులు, పిల్లలు ఒకే ప్రాంతంలో ఉండాలని నిబంధనలు పెట్టింది. ఫలితంగా మరో 25 శాతం మంది ఈ పథకానికి దూరమవుతారని అంచనా!
ఎన్పీసీఐ అనుసంధానంతో తలనొప్పులు
రకరకాల నిబంధనలతో లబ్ధిదారులను చికాకు పెడుతున్న తాజాగా ఎన్పీసీఐ అనుసంధానం పేరిట మరో మెలిక పెట్టింది. ఇప్పటికే ఇచ్చిన పాత బ్యాంకు ఖాతాలను ఆధార్, మొబైల్‌కు అనుసంధానం చేయాలని, లేదంటే అలా అనుసంధానమైన బ్యాంకు ఖాతాలనే స్కూలు లాగిన్‌కు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇది లబ్ధిదారులకు తలనొప్పిగా మారింది. తాము ఇచ్చిన బ్యాంకు ఖాతా ఎన్‌పీసీఐకి అనుసంధానమైందీ లేనిదీ తెలుసుకోవడం సమస్యగా తయారయింది. రెండు మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి ఎన్పీసీఐ నిబంధనల ప్రకారం ఏదో ఒక ఖాతానే ఎన్‌పీసీఐకి అనుసంధానమై ఉంటుంది. మిగిలిన ఖాతాలు ఎన్‌పీసీఐకి అనుసంధానమై ఉండవు. ఎన్పీసీఐతో అనుసంధానమై ఉన్న ఖాతాను కనిపెట్టడం ఎలానో తెలియక తల్లులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా ఇప్పుడు బ్యాంకులు, ఆధార్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పొమ్మనలేక పొగబెట్టిన తీరుగా ప్రభుత్వం ఇలా కొత్త కొత్త నిబంధనలను తెస్తోందని తల్లులు వాపోతున్నారు.
0 Comments:
Post a Comment