✍️అమ్మఒడి.. నిబంధనల ముడి
🌻రామచంద్రపురం పట్టణం (పామర్రు), న్యూస్‌టుడే: అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా 1-12 తరగతుల విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి లబ్ధిదారులకు జూన్‌లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు రూపొందించిన నిబంధనలు తమకు ప్రతిబంధకాలుగా మారేలా ఉన్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల అమలుపై అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు.
♦అలా కొర్రీలు..
నవంబరు 1 నుంచి ఏప్రిల్ ఆఖరు వరకు 75 శాతం హాజరు తప్పనిసరి.
●●● బియ్యం కార్డు కొత్తది కావాలి.
●●● కరెంటు బిల్లు నెలకు రూ.300 కన్నా తక్కువ ఉండాలి.
●●● విద్యార్థి, తల్లి ఒకే హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి.
●●● విద్యార్థి ఈకేవైసీ అప్డేట్ చేయాలి.
●●● సదరు వాలంటీరు వద్ద విద్యార్థి, తల్లి పేరు, వయసు సరిచూడాలి.
●●● బ్యాంకు ఖాతా.. ఆధార్‌కు లింక్ అయిందో లేదో చూడాలి.
●●● ఆధార్ నంబరుతో వాడే చరవాణి లింకై ఉండాలి.
●●● బ్యాంకు ఖాతా మనుగడలో ఉంచాలి.
●●● ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎన్పీసీఐ చేయించాలి.
♦ఏం చేస్తారో..?
ఇన్ని నిబంధనలు గ్రామీణ నిరక్షరాస్యులు అధిగమించగలరా అనేది ప్రశ్నార్థకమే. పైగా విద్యార్థి వివరాలన్నీ కూడా సీఎస్సీ వెబ్సైట్లో చైల్డ్ ఇన్ఫోలో డేటాతో సరిపోవాలి. పాఠశాల దస్త్రాల్లో హెచ్ఎం లాగిన్‌లో ఉన్న తల్లి ఖాతా, చరవాణి సంఖ్య ఒకటైనప్పుడు వారికి ఓటీపీ వస్తుంది. దాన్ని హెచ్ఎంలు వారి లాగిన్‌లో నమోదు చేస్తారు. అప్పుడే వారి ఖాతాకు అమ్మఒడి నగదు జమవుతుంది. ఈ నిబంధనలన్నీ లబ్ధిదారుల జాబితాను తగ్గించేందుకే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
♦ఇలా మొదలు..
1-12 తరగతుల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో బడి మానేయకూడదనే లక్ష్యంతో 2019-20 విద్యాసంవత్సరంలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్హులైన తల్లుల ఖాతాలకు రూ.15 వేల చొప్పున జమ చేశారు.
●●● 2020-21లో రూ.వెయ్యి తగ్గించి రూ.14 వేలు జమ చేశారు. మినహాయించిన రూ.వెయ్యి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఖాతాలకు వేశారు.
●●● రెండేళ్లుగా.. ఉమ్మడి జిల్లాలో 4,82,682 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఏడాదికి రూ.685 కోట్లు జమ చేశారు. కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో 2,14,538 మంది విద్యార్థులుండగా.. సుమారు 1,65,879 మందికి ఈ నగదు మంజూరైంది.
●●● ప్రస్తుత విద్యాసంవత్సరంలో 9-ఇంటర్ విద్యార్థుల్లో ఆప్షన్లు ఇచ్చిన వారికి నగదు బదులు ల్యాప్‌టాప్ ఇవ్వాలని భావించినాఈసారీ నగదు ఇస్తారని సమాచారం.
జాబితాలు రూపొందిస్తున్నాం..
ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి వచ్చిన ఆదేశాలను ప్రధానోపాధ్యాయులకు పంపిస్తున్నాం. మార్గదర్శకాలపై తల్లులకు అవగాహన కల్పించాలని సూచించాం. కరోనా నేపథ్యంలో చాలా మందికి 75 శాతం హాజరు ఉండదనే వాదన వస్తోంది. దీనిని సడలించడానికి ఉన్నతస్థాయిలో ఆలోచిస్తున్నారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అప్పటి వరకు ఇచ్చిన వాటినే కొనసాగించి జాబితాలు రూపొందిస్తున్నాం.
💥ఎన్.రవిసాగర్, డీఈవో, కోనసీమ
0 Comments:
Post a Comment