🔳జూలై 4 నుంచి నూతన విద్యా సంవత్సరం!
మే 9 నుంచి టెన్త్ విద్యార్థులకు సెలవులు
అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యా సంవత్సరం జూలై 4వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు మే రెండో వారం వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 27 నుంచి మే 9వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు పూర్తికాగానే పదో తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తారు. అనంతరం వారం నుంచి పది రోజులపాటు మూల్యాంకనం ఉంటుంది. మిగతా తరగతులకు జరగాల్సిన సమ్మేటివ్-2 పరీక్షలను ఈ నెలాఖరులో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు కాగానే ఆ తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తారు. జూలై 4వ తేదీన నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలనే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. కాగా జూనియర్ కళాశాలలకు మే 25 నుంచి సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అవి పూర్తికాగానే సెలవులు ప్రకటిస్తారు.
అయితే ఈ విషయంలో కొంత తర్జన భర్జన జరిగింది. ఏప్రిల్ 28వ తేదీ నుంచే సెలవులు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. సిలబస్ పూర్తయిన దృష్ట్యా సెలవులు ఇచ్చేసి, విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరయ్యేలా చేస్తే సరిపోతుందన్న సూచనలు వచ్చాయని సమాచారం. ఇలా చేస్తే విద్యార్థులు పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధం కాలేరేమోనన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదేవిధంగా విద్యార్థులకు ఏదైనా సబ్జెక్టుకు సంబంధించి సందేహాలు వస్తే నివృత్తి చేసేందుకు అధ్యాపకులు అందుబాటులో ఉండరు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక పరీక్షలు పూర్తయిన తర్వాతే సెలవులు ఇవ్వాలనే ప్రాథమిక అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. జూనియర్ కళాశాలలకు నూతన విద్యా సంవత్సరం జూన్ 20వ తేదీ తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మే 25 నుంచి జూన్ 20వ తేదీవరకు సెలవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.
0 Comments:
Post a Comment