7న ఏపీ మంత్రుల రాజీనామా- ఆ ఇద్దరు మినహా-కేబినెట్ ముగియగానే- 11న కొత్త మంత్రివర్గం..
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తికావడంతో సీఎం జగన్ ఇక మంత్రివర్గ ప్రక్షాళనపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుకున్న విధంగానే ఈ నెల 11న కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం దిశగా ఆయన పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఆయన అధికారులతో పాటు మంత్రులకూ సంకేతాలు ఇచ్చేశారు. వాటి ప్రకారం వారు కూడా తాము చేయాల్సిన పనులపై క్లారిటీతో ముందుకుసాగుతున్నారు.
ఏప్రిల్ 7న మంత్రుల రాజీనామాలు
ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో దాదాపు 90 శాతం మంత్రులు ప్రక్షాళనలో భాగంగా పదవులు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో అనుకున్న పేర్లకు భిన్నంగా పలు కొత్త సమీకరణాలు తెరపైకి రావడంతో కేబినెట్ లో ఉంటారని భావించిన వారు కూడా రాజీనామాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 7న మంత్రుల మూకుమ్మడి రాజీనామాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం వారికి షెడ్యూల్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
కేబినెట్ ముగియగానే రాజీనామా
ఈ నెల 7న ప్రస్తుత మంత్రులతో సీఎం జగన్ కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. అందులోనే మంత్రులతో కలిసి జగన్ కొన్నికీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత చివరి కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే మంత్రివర్గంలో కొనసాగే, పదవులు కోల్పోయే మంత్రుల పేర్లును వారికి తెలియజేయడంతో పాటు రాజినామాలు చేయాల్సిన వారి జాబితా కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం సదరు మంత్రులు కేబినెట్ భేటీ ముగిశాక నేరుగా సీఎంకే రాజీనామాలు సమర్పించనున్నారు.
ఇద్దరు బీసీ మంత్రులకు మరో ఛాన్స్
ప్రస్తుత కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో ఇద్దరు మినహా మిగిలిన మంత్రులు ఈ నెల 7న కేబినెట్ భేటీ తర్వాత రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తొలి కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రి అయిన గుమ్మనూరు జయరాంతో పాటు మధ్యలో కేబినెట్ లో చేరిన మరో బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా తదుపరి కేబినెట్ లో కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని వీరిద్దరిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారంతా రాజీనామాలు చేయాల్సి ఉంటుంది.
కొత్త కేబినెట్ ఏర్పాట్లు ఇలా..
కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన వారంతా తనకు సమర్పించిన రాజీనామాల్ని సీఎం జగన్.. ఈ నెల 8న గవర్నర్ ను కలిసి స్వయంగా అందజేయబోతున్నారు. వాటికి ఆమోదముద్ర వేయాల్సిందిగా గవర్నర్ ను ఆయన కోరతారు. అలాగే కొత్త కేబినెట్ ను 11న ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం జగన్ గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇందులో కొత్తగా 23 మందికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే పూర్తయిన కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment