కసరత్తు కొలిక్కి! : తుది దశలో కొత్త జిల్లాల ప్రక్రియ
సెలవులైనా అందుబాటులో ఉండండి : సిఎస్ ఆదేశం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది.
జిల్లాల ప్రకటనకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి. నాల్గవ తేది అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ పూర్తి చేయవలసిన సాంకేతికపరమైన అంశాలపై దృష్టి సారించినట్లు ఆ వర్గాలు చెప్పాయి. దీనికి సంబంధించి సవివరమైన నోట్‌ను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఏ దశలో ఏమి చేయాలో దీనిలో వివరించామని తెలిపాయి. జిల్లాల ప్రక్రటన తరువాత ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి 10, 15 రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు రాష్ట్ర స్థాయిలోని అఖిల భారత సర్వీసు అధికారులందరూ 2,3 తేదీలు సెలవుదినాలైనప్పటికీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ వంటి క్యాడర్ అధికారులంతా తమ తమ ప్రధాన కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఆదేశాలు అమలు చేయాలని పేర్కొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా, రెవిన్యూ డివిజన్, మండల స్థాయిలోనూ అధికారులందరూ ఉగాది రోజుతో పాటు, ఆదివారం నాడు కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలలో అధికారులు మాత్రమేనని పేర్కొన్నప్పటికీ దాదాపుగా క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు అందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
0 Comments:
Post a Comment