21 మండలాలు.. ముగ్గురు ఎంఈవోలు
బడులపై పర్యవేక్షణ కరవు..
పథకాల అమలుపై ప్రభావం
న్యూస్‌టుడే,
పెద్దశంకరంపేట
పెద్దశంకరంపేట విద్యాధికారి కార్యాలయం
జిల్లాలో విద్యా వ్యవస్థపై పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ గాడితప్పుతోంది. రెగ్యులర్ ఎంఈవోలను నియమించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఏళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా ఉంచడంతో విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో 21 మండలాలకు కేవలం ముగ్గురు ఎంఈవోలు ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. వారికీ అదనపు బాధ్యతలు పెరిగి పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నారు. జిల్లాలో ఫిబ్రవరి నెల వరకు ఏడుగురు ఎంఈవోలు బాధ్యతలు నిర్వర్తించారు. జోనల్ వారీగా ప్రభుత్వం బదిలీలు చేయడంతో ఏడుగురిలో నలుగురు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కొత్త వారికి అదనపు బాధ్యతలు అప్పగించడానికి విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం ఉన్న ఎంఈవోలకే అప్పగించారు. దీంతో ఒక్కొక్కరిపై ఆరు నుంచి ఎనిమిది మండలాలకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.
కనీస వసతుల కల్పనకు..
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదులు, శౌచాలయాలు, శిథిలావస్థలోని గదుల మరమ్మతులు చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో బడులను ఎంపిక చేయగా, ఆయా చోట్ల చేయాల్సిన పనులపై నివేదిక రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎంఈవోలు లేకపోవడంతో వివిధ శాఖల అధికారులు సౌకర్యాల కల్పనపై ఆరా తీస్తున్నారు. అధిక నిధులు కేటాయించి.. పనులు చేపట్టాలన్న ప్రభుత్వ ఆశయానికి గండిపడుతోంది. ఇన్ఛార్జిలతో నెట్టుకొస్తున్న క్రమంలో వసతుల కల్పనపై దృష్టి సారించడం కష్టసాధ్యంగా మారింది.
మధ్యాహ్న భోజనం..
ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు గాడి తప్పిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల నిర్వాహకులు లేక ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు భోజనం తయారు చేయిస్తున్నారు. బిల్లులు రాక కొంత మంది మానేశారు. ఇక మరికొన్ని బడుల్లో అక్షయపాత్ర ద్వారా పథకం అమలు అవుతుండగా.. పర్యవేక్షణ లోపించింది.
ఎవరు..ఎక్కడంటే..
శివ్వంపేట ఇన్‌ఛార్జి ఎంఈవోగా పని చేస్తున్న బుచ్చానాయక్కు అదనంగా నర్సాపూర్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గం, కౌడిపల్లి, చిలప్‌చెడ్, చేగుంట, నార్సింగి మండలాల బాధ్యతలు అప్పగించారు. కొల్చారంలో కొనసాగుతున్న నీలకంఠం.. మెదక్, హవేలిఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, రామాయంపేట, నిజాంపేట మండలాలను పర్యవేక్షిస్తున్నారు. వెల్దుర్తి మండల విద్యాధికారి యాదగిరి చిన్నశంకరంపేట, తూప్రాన్, మనోహరాబాద్, మాసాయిపేట బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జిల్లాలో పాఠశాలలు ఇలా..
ప్రాథమికోన్నత : 131
ప్రాథమిక : 623
ఆదర్శ : 7
ఉన్నత : 145
కస్తుర్బా : 15
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : - రమేష్, జిల్లా విద్యాధికారి
ఎంఈవోల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ పర్యవేక్షణ లోపం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
0 Comments:
Post a Comment