Weather Update: భానుడి భగభగలు.. 3 రోజులు జాగ్రత్త..
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. రికార్డు స్థాయిలో ఉష్ట్రోగ్రతలు పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయట అడుగుపెట్టడానికి భయపడి పోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, రెంటచింతల ప్రాంతాల్లో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో కూడా 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఓవైపు ఎండలు మరోవైపు వడగాలులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఇక, మరో మూడు రోజులపాటు ఎండలు, వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండకు తోడు వడ గాలుల తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ ఉంటాయని చెబుతున్నారు.
ఇటు, తెలంగాణలోనూ భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి భద్రాచలం, మెదక్ ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారత నుంచి తెలంగాణలోకి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంది ఐఎండీ. ఏపీలోని కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదు అవుతున్నా.. పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రత అధికంగా ఉంటోంది. ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతోంది. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
0 Comments:
Post a Comment