Vijaya bhanu Teacher - నచ్చింది చెయ్యడమే విద్య.. అక్కడ ఆదేశించే టీచర్లుండరు
అక్కడ పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులుండరు. 'ఇది చదవండి... అలా చెయ్యండి... హోమ్ వర్క్ చేసుకురండి' అంటూ ఆదేశించే టీచర్లుండరు.
విద్యార్థులు ఏది నేర్చుకోవాలనుకుంటే దాన్నే ప్రోత్సహిస్తారు. 'హ్యుటగోజీ' అనే ఈ విధానాన్ని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట కొత్త హరిజనవాడ పాఠశాలలో అమలుచేస్తున్నారు ఉపాధ్యాయురాలు విజయభాను కోటే. హ్యుటగోజీ ప్రయోజనాలు, ఆ బోధన కోసం తాను రూపొందించిన నమూనా తదితర అంశాలను ఆమె నవ్యతో పంచుకున్నారు.
''ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఇరవై నాలుగేళ్ళ నుంచి పని చేస్తున్నాను. మొదటి నుంచీ కొత్త పద్ధతుల్లో బోధన చెయ్యాలనే తపన ఉండేది. అందుకే... వివిధ దేశాల్లో అమలవుతున్న విద్యావిధానాల గురించి, ప్రయోగాల గురించి తెలుసుకొనేదాన్ని. ఈ క్రమంలోనే... 'హ్యుటగోజీ అనే పేరుతో ఆస్ట్రేలియాకి చెందిన స్టీవర్ట్ హీజ్, క్రిస్ కెన్యాన్ వినూత్న విద్యాభ్యాస విధానం కనిపెట్టారని తెలుసుకున్నాను. పోస్ట్ డాక్టర్ ఫెలోస్ కోసం వాళ్ళు రూపొందించిన ఈ పద్ధతిని చిన్న మార్పులతో వివిధ దేశాల్లో అమలు చేస్తున్నారు. దాన్ని ఇక్కడి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనిపించింది.
ప్రయోగం మా అబ్బాయి మీదే...
పిల్లలు అనుకరించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. కానీ 'అది చెయ్యి, ఇలా చదువు' అంటూ వారి మీద ఒత్తిడి పెట్టి, ఆ అనుకరణ సామర్థ్యాన్ని మనం దెబ్బతీస్తున్నాం. పిల్లలు వారికి నచ్చేది చెయ్యడమే విద్య. హ్యుటగోజీ విధానాన్ని అధ్యయనం చేశాక... అప్పటికి ఏడాదిన్నర వయసున్న మా అబ్బాయి మీదే దాన్ని ప్రయోగించాను. కలర్ పెన్సిల్స్, 'మ్యాజిక్ పాట్' పుస్తకం పరిచయం చేశాను. మొదట్లో వాడు పెన్సిల్ విసిరేశాడు, పుస్తకం చించేశాడు. కానీ కొన్ని రోజుల తరువాత... నేను చేస్తున్నది చూసి... అలాగే చేయడం ప్రారంభించాడు. పుస్తకాన్ని పద్ధతిగా తెరవడం, కలర్ పెన్సిల్స్ పట్టుకొని గీతలు గీయడం అలవాటయింది. వాడు పెరిగే కొద్దీ పనుల్లో, ఆలోచనల్లో స్వేచ్ఛ ఇచ్చాను.. స్కూల్లో నేర్చుకున్నదే పరీక్షల్లో వాడు ప్రెజెంట్ చెయ్యాలి తప్ప హోమ్ వర్క్ ఇవ్వవద్దని వాడు చదివిన ప్రతి బడిలో టీచర్లకు చెప్పేదాన్ని. వాడు ఇంటికి వచ్చాక ఎప్పుడూ చదవలేదు. తరగతిలో విన్నదే పరీక్షల్లో రాసి మంచి ఫలితాలు సాధించాడు. ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తున్నాడు. ఇంటికి వచ్చాక సంగీతం వినడం, గిటార్ వాయించడం... ఇలా మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఉంటాడు.
పదకొండు నెలలు శ్రమించి...
మా అబ్బాయి మీద చేసిన ప్రయోగం మంచి ఫలితాన్ని ఇవ్వడంతో... హ్యుటగోజీ విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసి... విద్యార్థులందరికీ ఉపయోగపడేలా సరికొత్త ఫ్రేమ్‌వర్క్ రూపొందించాను. దాని కోసం పదకొండు నెలలపాటు శ్రమించాను. దీని ప్రకారం... మొదటి నెలలో పిల్లలకు ఆటలు, కథలు చెబుతాం. ఆ తరువాత... అయిదు నెలలపాటు... వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఎలా చదవాలి తదితర విషయాల్లో శిక్షణ ఇస్తాం. చివరి అయిదు నెలల్లో.. పిల్లలే తమ కార్యకలాపాలు పూర్తిగా చేసుకొనే స్వేచ్ఛ అందిస్తాం. ఆ తరువాత టీచర్ల ప్రమేయం ఉండదు. ఇక, రోజును నాలుగు సెషన్స్‌గా విభజిస్తాం. మధ్యాహ్న భోజనానికి ముందు రెండు, ఆ తరువాత రెండు ఉంటాయి. ఒకటి నుంచి అయిదు తరగతుల వరకూ పిల్లలకు నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి. డ్రాయింగ్, మోరల్ సైన్స్ అనే రెండు సబ్జెక్ట్‌లను కలిపి... 'కో-రిలేషన్ కాన్సెప్ట్'ను పరిచయం చేశాను.
ఈ కాన్సెప్ట్‌లో...
రోజూ పాఠానికి సంబంధించిన బొమ్మను బోర్డు మీద గీయడం... పుస్తకంలో ఉండే బొమ్మలు, పేర్లు, అంకెలను పిల్లలకు పరిచయం చేయడం ద్వారా వారిని ఇన్వాల్వ్ చేస్తాం. ఆ తరువాత పిల్లలే బొమ్మలు వేసి పాఠాలు చెబుతారు. ఉదాహరణకు తెనాలి రామలింగడు పాఠాన్ని చెప్పాలంటే... విద్యార్థుల్లోనే కొందరు తెనాలి రామలింగడుగా, దొంగలుగా అవతారం ఎత్తుతారు. పాఠం మొత్తాన్ని నాటకంగా ప్రదర్శిస్తారు. అలాగే లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్... ఇలా అన్నీ నేర్చుకుంటారు. దీనివల్ల వాళ్ళకి అవి ఎప్పటికీ గుర్తుంటాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళాక హోమ్ వర్క్ ఉండదు. బడికి వచ్చే దారిలో చూసిన అంశాలు, సినిమానో, సీరియల్లో చూస్తే... వాటిలో నచ్చిన విషయాలు రాసుకొని రావడమే. అలాగే తరగతి గదిలో ఉండే కిట్స్‌ను వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి, ప్రాజెక్టులుగా రూపొందించి తెస్తారు. ఉదాహరణకు... మా పాఠశాలలో సైన్స్ డే నిర్వహించడానికి నిర్ణయించి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా ప్రాజెక్ట్స్ రూపొందించాలని పిల్లలకు చెప్పాను. నాలుగో తరగతి చదివే పిల్లలకు సైన్స్ డే అంటే తెలీదు. కానీ దాని గురించి వాళ్ళు ఇంటర్నెట్లో శోధించి, ఇంట్లో ఉండే వస్తువులతో ప్రాజెక్టులు చేసుకొచ్చారు. ఇది మా విధానం అమలు మీద మరింత నమ్మకాన్ని పెంచింది.
అమ్మకాలు చేయిస్తాం...
మా బడిలో అప్పుడప్పుడు సంత లాంటిది నిర్వహిస్తాం. పిల్లలు తమ ఇంటి దగ్గర ఉండే ఉసిరికాయల్లాంటివి తెచ్చి అమ్ముతారు. క్రయ, విక్రయాల ద్వారా కూడికలు, తీసివేతలు నేర్చుకుంటారు. దీన్ని నైపుణ్య ఆధారిత బోధన అనవచ్చు. 2009 నుంచి ప్రారంభించి... నేను పని చేసిన ప్రతి పాఠశాలలో ఈ విధానాన్ని అమలు చేశాను. అయితే. అయిదో తరగతి పూర్తయ్యాక... విద్యార్థులు హైస్కూళ్ళకు వెళ్ళడం, అక్కడ టీచర్లు మారిపోవడం, సబ్జెక్ట్ విధానంలో బోధన సాగడంతో... పిల్లలు మా విధానానికి దూరమైపోతున్నారు.
అనారోగ్యం వేధిస్తున్నా..
నేను అత్యంత అరుదైన ప్రాణాంతక వ్యాధి క్యూచింగ్స్ సిండ్రోమ్‌తో ఎనిమిదేళ్లుగా బాధపడుతున్నాను. బ్రెయిన్ ట్యూమర్ ఉందని కిందటి ఏడాది బయటపడింది. గత అక్టోబర్‌లో క్రిటికల్ సర్జరీ అయింది. మళ్ళీ డిసెంబర్లోనే విధుల్లో చేరిపోయాను. నా ప్రయోగం మధ్యలో ఆగిపోకూడదని నా తాపత్రయం. ప్రస్తుతం అయిదో బ్యాచ్ అయిదో తరగతిని పూర్తి చేసుకోబోతోంది. నేను ఎంతకాలం జీవించి ఉంటానో తెలీదు. ఈలోగా మరింత మంది టీచర్లకు ఈ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలన్నది నా లక్ష్యం. మేము అయిదో తరగతి వరకూ తీర్చిదిద్దిన పిల్లలను విదేశాల్లోని పాఠశాలలకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నా లక్ష్య సాధనలో నా భర్త బంగార్రాజు, కుమారుడు ఎంతగానో సహకరిస్తున్నారు.
కరోనా సమయంలో ఒత్తిడి లేకుండా...
పాయకరావుపేట ఇందిరా కాలనీలోని కొత్త హరిజనవాడ (కేహెచ్వాడ) ప్రాథమిక పాఠశాలకు 2015 డిసెంబర్లో బదిలీపై వచ్చాను. ఆ మరుసటి ఏడాది నుంచి మూడు, నాలుగు తరగతుల విద్యార్థులకు హ్యుటగోజీ విధానంలో విద్య నేర్పించడం ప్రారంభించాను. అయిదో తరగతికి వెళ్ళేవరకూ వారికి మదర్ టీచర్‌గా వ్యవహరిస్తున్నాను. 2017లో ఒకటో తరగతిలో ఉన్న 20మంది విద్యార్థులు ఇప్పుడు నాలుగో తరగతికి వచ్చారు. వారు తమకు నచ్చిన విధంగా అన్ని సబ్జెక్టులను సొంతంగా నేర్చుకుంటున్నారు. వారిలో ముగ్గురు 'టెక్-2019' అంతర్జాతీయ సదస్సుకు హాజరై, హ్యుటగోజీ విధానంలో బోధనపై రూపొందించిన యాప్‌ను ప్రదర్శించారు. కరోనా సమయంలో సైతం మా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా... స్వేచ్ఛగా తమ పనులు చేసుకున్నారు. ఈ బ్యాచ్‌కు అయిదేళ్ళు పూర్తయ్యాక. వారిలో హ్యుటగోజీ తెచ్చిన పురోగతి వారి అభివృద్ధికి ఎలా దోహదం చేస్తుందో వివరిస్తూ పుస్తకం రాస్తాను. కాగా, ఇప్పటివరకూ వందమందికి పైగా టీచర్లకు శిక్షణ అందించాను.
'హ్యుటగోజీ' అంటే...
'హ్యుటగోజీ' అనేది గ్రీకు పదం. స్వీయ నిర్ణయాత్మక అభ్యసనం అనొచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవర్డ్ హేడ్ దీన్ని కనుక్కున్నారు. లండన్ రాయల్ ఫెడరేషన్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అవార్డు గ్రహీతలు ఫ్రెడ్ గార్నెట్, నిగెల్ ఎక్లెస్పీల్ట్ దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇది స్వీయ అభ్యసనానికి భిన్నంగా ఉంటుంది. నేర్చుకోవాలనే నిర్ణయానికి విద్యార్థులే స్వయంగా వచ్చి.... తమకు తాముగా అభ్యాసం వైపు మొగ్గు చూపుతారు. నేను హ్యుటగోజీపై తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాలు రాశాను. ప్రస్తుతం ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ డెవల్‌పమెంట్ కోసం కృషిచేస్తున్న సీసీఈ (ఫిన్లాండ్కు) అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నా. 2017లో జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సులో 'భారత్‌లో హ్యుటగోజీ విధానం అమలు'పై మాట్లాడాను. అలాగే 2017 నుంచి వరుసగా నాలుగేళ్ళపాటు టెక్ గ్లోబల్ కాన్ఫరెన్సుల్లో ప్రసంగించాను. నేను అమలు చేస్తున్న విద్యాభ్యాస విధానంపై ఆసక్తి కనబర్చిన లండన్‌లోని రివర్లీ ప్రైమరీ స్కూల్ నిర్వాహకులు దీనిపై అవగాహన పెంచుకోవడానికి ముందుకువచ్చారు. ఏడాదిపాటు జూమ్ తరగతులు నిర్వహించాలని కోరారు.. ఈనెల 18న మొదటిసారి జూమ్‌లో ఇక్కడి విద్యార్థులతో రివర్లీ స్కూల్ విద్యార్థులు అనుసంధానమై... ఇక్కడి అభ్యసన పద్ధతుల గురించి తెలుసుకున్నారు.
ఇక, మా స్నేహితులతో కలిసి పాయకరావుపేట పాత హరిజనవాడ పాఠశాలను అభివృద్ధి చేశాను. అది 2013లో... దేశంలోనే మొదటి డిజిటల్ పాఠశాలగా గుర్తింపు పొందింది. ప్రస్తుత పాఠశాలలో విద్యార్థులకు 22 ట్యాబ్స్ అందజేశాం. ఇంటర్నెట్ అవసరం లేకుండా పని చేసే 30 యాప్‌లు వాటిలో ఇన్స్టాల్ చేశాం. విద్యార్థుల ఇష్టాల్ని గుర్తిస్తే... వాళ్ళకి తమపై నమ్మకం పెరుగుతుంది. చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
బూటు శ్రీనివాసరావు, విశాఖపట్నం,
గురజాపు శివప్రసాద్, పాయకరావుపేట.
Thank you so much for sharing
ReplyDelete