Small savings scheme: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇవే!
దిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small savings scheme)పై ఇస్తున్న వడ్డీలో ప్రభుత్వం ఎలాంటి మార్పూ చేయలేదు. ప్రస్తుతం ఉన్న వడ్డీనే 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికీ (ఏప్రిల్-జూన్) వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్రం వడ్డీ నిర్ణయిస్తుంది. గత 8 త్రైమాసికాలుగా కేంద్రం ఈ వడ్డీలను సవరించలేదు. అయితే, ఈపీఎఫ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో వీటి వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తారని ప్రచారం జరిగింది. కానీ వరుసగా తొమ్మిదోసారి కేంద్రం యథాతథ స్థితినే అనుసరించింది. ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 6.8 శాతం, పీపీఎఫ్‌పై 7.1 శాతం, కిసాన్ వికాస్పత్ర 6.9 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వడ్డీ లభిస్తోంది.
0 Comments:
Post a Comment