Salary With Biometric - జీతాలకు బయో హాజరుతో ముడి...
వైద్య, ఉద్యోగుల్లో ఆందోళన
ఈనాడు, అమరావతి
వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
వారి జీతాలకు బయోమెట్రిక్ హాజరుతో ముడిపెట్టడంతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసే ఏఎన్ఎంలు, ఆశాలు, ఇతర పారామెడికల్ సిబ్బంది తాము హాజరు ఎలా వేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ఉదయాన్నే 7 గంటలకు లేచి వ్యాక్సిన్ కోల్డుచైన్ బాక్సులు తీసుకుని పల్లెలకు వెళతామని, ఇంకేదైనా గ్రామంలో డెలివరీ కేసులు ఉన్నాయంటే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్తామని అంటున్నారు. అలాంటప్పుడు తాము బయోహాజరు నిర్దేశిత పీహెచ్‌సీకి వెళ్లి వేసుకోవటం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఏప్రిల్ ఒకటి నుంచి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు మొదలుకుని సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు వేసుకోవాలని, దాని ఆధారంగానే జీతాలు చెల్లిస్తామని ఇప్పటికే డీఎంహెచ్ఓ సర్క్యులర్ జారీ చేశారు.
మార్చి 31 నాటికి అన్ని ఆస్పత్రుల్లో యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 87 పీహెచ్‌సీల పరిధిలో సుమారు 4 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒప్పంద ఉద్యోగులకు మినహాయింపు లేదని కమిషనర్ స్పష్టం చేశారు. జిల్లాలో రెండు, మూడు షిప్టుల్లో పనిచేసే పీహెచ్‌సీల్లో ఏ ఉద్యోగి ఏ సమయంలో ఉంటారో వారి వివరాలను సైతం డీఎంహెచ్ఓ కోరారు. ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు ద్వారానే జీతాలు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేయటంతో పనుల్లో పీహెచ్సీ వైద్యులు ఉన్నారు ఇంతకుముందే డివైస్‌లు సరఫరా చేశారు. అవి ఏమైనా పనిచేయకపోయినా, అందుబాటులో లేకపోయినా వెంటనే వాటి స్థానే కొత్తవి కొనుగోలు చేసుకోవాలని స్పష్టం చేశారు.
హెచ్‌డీఎస్ నిధులు..
యంత్రాల మరమ్మతులు, కొత్తవి కొనుగోలు చేసుకోవటానికి ఆస్పత్రి అభివృద్ధి సంఘం (హెచ్‌డీఎస్) నిధుల వెచ్చించుకోవాలని సూచించారు. అయితే ప్రతి పీహెచ్సీ పరిధిలో ఐదారు ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో పనిచేసే ఉద్యోగులు, తరచూ ఫీల్డ్‌లో ఉండే ఉద్యోగులు ఎలా హాజరు వేసుకోవాలో స్పష్టతను ఇవ్వలేదు. ఉప ఆరోగ్య కేంద్రాల్లో కూడా వాటిని ఏర్పాటు చేయాలని, అప్పుడే తామంతా హాజరు వేసుకోవటానికి సాధ్యపడుతుందని ఉద్యోగులు సూచిస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరైనా బయోమెట్రిక్ హాజరుకు పేర్లు నమోదు చేసుకోకపోతే జిల్లా జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసి), డీఎంహెచ్‌వో కార్యాలయంలోని ఐటీసెల్‌ను సంప్రదించాలని సూచించారు.
0 Comments:
Post a Comment