PIL against New Districts: జగన్ సర్కార్కు మరో షాక్.. కొత్త జిల్లాలపై హైకోర్టులో పిల్..
PIL filed against formation of new districts: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాల విభజన ఆయనకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది.
కొత్తజిల్లాలను ఉగాది నుంచి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుండగా.. అంతే వేగంగా సమస్యలు వచ్చి పడుతున్నాయికొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వైసీపీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతలే రొడ్డెక్కి ఆందోళనలు చేశారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ జిల్లాల విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. వైసీపీ నేతలే సర్కార్ కు వార్నింగులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది.
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. జిల్లాల విభజనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా విభజన చేయకూడదని పిల్లో పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాదు, జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాకుండానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళంకు చెందిన సిద్దార్థ బెజ్జి, ప్రకాశంకు చెందిన జాగర్లమూడి రామారావు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
జిల్లాల విభజనకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని.. రాష్ట్రపతి ఆమోదం లేకుండా జిల్లాలను విభజిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పిల్లో తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుత జిల్లాలు, జోన్ల భౌగోళిక స్వరూపం మారిపోతుందని.. ఇది రాష్ట్రపతి ఉత్వర్వులకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు విడుదల చేసిన జీవోను నిలుపుదల చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిల్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో దాఖలైన ఈ పిల్ సోమవారం సీజే బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment