Edible oil Price: వంట నూనె ధరల కట్టడిపై ఫోకస్.. వ్యాపారులకు ప్రభుత్వం హెచ్చరిక
Edible oil Price: ఉక్రైన్-రష్యా యుద్ధం ( Ukraine -Russia War).. ఇతర అంతర్జాతీయ పరిణామాలతో.. వంట నూనెల ధరలు (Edible oil Price) ఊహించని స్థాయిలో వంట ఇంట్లో మంట పెడుతున్నాయి.
అసలు వంట నూనె ధరలు వింటేనే గుండె ఆగినంత పని అవుతోంది. ఆ రెండు దేశాల యుద్ధం పేరుతో.. పలు రకాల ఉత్పత్తులతో పాటు వంట నూనెలపైనా ప్రభావం పడింది. సరిగ్గా 40 రోజుల క్రితం మార్కెట్ లో 200 రూపాయలు ఉండే ఆయిల్ ధరలు.. ఇప్పుడు కొన్ని చోట్ల బహిరంగ మార్కెట్ లో 300ల రూపాయలు కూడా దాటడం కలవర పెడుతోంది. సాధారణంగా ఎక్కడ ఏది జరిగినా.. దాని ప్రభావం సామాన్యులపైనే పడుతున్నాయి. అవకాశం ఉందనే చర్చ సాగిందంటే చాలు.. వెంటనే బ్లాక్ మార్కెట్ దారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంటనే జాలా లేకుండానే.. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలకు షాక్ ఇస్తున్నారు వ్యాపారులు.. దీంతోనే సన్ ఫ్లవర్, పామాయిల్, వేరుశనగ నూనెలు ఎమ్మార్పీ ధరలు మండిపోతున్నాయి. అందుకే ప్రస్తుతం వండకుండానే వంట నూనె మంట పెడుతోంది. కేవలం పెట్రోల్ మాత్రమే కాదు. ఇకపై వంట నూనె కొనాలి అంటేనే చుక్కలు చూపిస్తోంది. భారీగా పెరుగుతున్నఈ రేట్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది.. వంట నూనెల ధరలకు బ్రేక్ వేసే ప్రయత్నాలను ప్రారంభించింది.
భారీగా పెరుగుతున్న వంట నూనె రేట్లతో సామాన్యులు హడలిపోతున్నారు. ఇలా రేట్లు పెరిగితే నూనె కొనేదెలా అని చింతిస్తున్నారు. ఇకపై వంట నూనెకు దూరం కావాల్సిందే అనే భయం వెంటాడుతోంది. దీంతో సామాన్య ప్రజల ఇబ్బందులను ఆలోచించి ఏపీ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లో కొన్ని కౌంటర్లు పెట్టనున్నారు. మొబైల్ వాహనాల్లో కూడా ఆయిల్ విక్రయించనున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీంతో అధికధరల విక్రయానికి చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తాము చేయాల్సింది అంతా చేస్తామని.. కానీ ఈ రేట్లు అదుపులోకి రావాలి అంటే.. ప్రజలు కూడా చౌకధరల దుకాణాల్లో కొనాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా ఇకపై నూనె వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు అధికారులు. అక్రమంగా నిల్వ చేసే వారిపై కేసులు నమోదు చేసి వారి వద్ద ఉన్న స్టాకును స్వాధీనం చేసుకుని తక్కువ ధరకు విక్రయించనున్నారు.
కేవలం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంట నూనెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారత్‌లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు చోట్ల వ్యాపారులు దొరికిందే సందు అని నూనె ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వంట నూనెలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. పాత స్టాక్ విషయంలో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఇకపై వంటనూనె విక్రయాల విషయంలో అక్రమాలకు పాల్పడినవారిని ఉపేక్షించేది లేదన్నారు. అలా చేసినట్టు తెలిస్తే వెంటనే బైండోవర్ కేసులు పెడతామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు.
ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ బ్లాక్ మార్కెటింగ్‌పై దాడులు కొనసాగుతాయని చెప్పారు. ఎక్కడైనా భారీ రేటుకు అమ్మినట్టు ప్రజలకు అనిపిస్తే.. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. 9440906254 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని సూచించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంటనూనె ధరలు పెరిగాయని.. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు , దుకాణాలపై దాడులు చేశామని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 1890 ప్రదేశాల్లో తనిఖీలు చేసి 59 కేసులు నమోదు చేశామన్నారు. 889 కేసులను లీగల్ మెట్రాలజీ అధికారులు నమోదు చేశారని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment