బడి పంతులు వక్ర మార్గం
గంజాయి స్మగ్లర్‌గా మంథని ఉపాధ్యాయుడు
విద్యాశాఖలో డుమ్మారాయుళ్లపై లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
పట్టుకున్న గంజాయి ప్యాకెట్లతో మహారాష్ట్ర పోలీసులు
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: న్యూస్‌టుడే, మంథని గ్రామీణం: సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే గంజాయి సరఫరా చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు దొరకడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఇద్దరు నిందితుల్లో మంథనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మాచిడి శ్రీనివాస్‌గౌడ్ ఉండటం స్థానికంగా కలకలర రేపింది. పట్టణంలోని మసీదువాడలో నివాసం ఉంటున్న అతడు బెస్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా ఏడేళ్లుగా పని చేస్తున్నాడు. గతంలో ప్రైవేటు పాఠశాల కూడా నిర్వహించిన శ్రీనివాస్‌గౌడ్ ప్రస్తుతం స్థిరాస్తి సెటిల్మెంట్లు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.
అనుమతి లేకుండానే విధులకు గైర్హాజరు
శ్రీనివాస్‌గౌడ్ ఈ నెల 11 వరకు పాఠశాలకు హాజరైనట్లు మంథని ఎంఈవో లక్ష్మి తెలిపారు. 12న రెండో శనివారం, 13న ఆదివారం కాగా 14వ తేదీ నుంచి 17 వరకు సెలవు పెట్టారు. 18న హోలీ సెలవు కాగా, 19న ముందస్తు సమాచారం లేకుండానే గైర్హాజరయ్యాడు. 21 నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరు కావాలని కాంప్లెక్స్ హెచ్ఎం శివలీల సూచించగా అనారోగ్యంగా ఉందని, మెడికల్ లీవ్‌కు దరఖాస్తు చేసుకుంటానని మౌఖికంగా చెప్పాడని, ఎలాంటి లిఖితపూర్వక అనుమతులు లేకుండానే మంథని వదిలి వెళ్లిపోయినట్లు ఎంఈవో తెలిపారు. తాజా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశించినట్లు చెప్పారు. ఉపాధ్యాయుడు వారం రోజుల పాటు విధులకు హాజరు కాకపోయినా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం విద్యాశాఖలో పరిస్థితికి అద్దం పడుతోంది.
నిందితులు శంకర్, శ్రీనివాస్‌గౌడ్
రాజకీయ అండదండలతో తెగింపు
శ్రీనివాస్‌గౌడ్ మామ(భార్య తండ్రి) ప్రస్తుతం ఓ పార్టీ మంథని మండల అధ్యక్షుడిగా ఉన్నారు. అత్త గతంలో ఎంపీపీగా పని చేశారు. రాజకీయ అండదండలతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్ భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు సమగ్ర విచారణ జరిపితే దందాలో ఎవరెవరు ఉన్నారనే విషయం తేలనుంది.
వరుస ఘటనలతో విద్యాశాఖలో కలకలం
పెద్దపల్లి జిల్లాలో ఇటీవలే ఓ ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెన్షన్ కావడం విద్యాశాఖలో కలకలం సృష్టించింది. ఇందులో ధర్మారం ఉపాధ్యాయుడు మెహ్రాజుద్దీన్ విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపి సస్పెండ్ కాగా పొట్యాల జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం హరిప్రసాద్, అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సుజాత విధుల్లో నిర్లక్ష్యం చూపినందుకు వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సస్పెండ్ చేశారు. కాగా పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాలు, చిట్‌ఫండ్స్ ఏజెంట్లుగా.. ఇతర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి వాటిని ఉన్నతాధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం వ్యవస్థీకృత లోపాలను తెలియజేస్తోంది.
0 Comments:
Post a Comment