CM Jagan: మూడు మారదు
అధికార వికేంద్రీకరణే ప్రభుత్వ విధానం
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏజీ, సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
సుప్రీంకు వెళ్లడంపై ఆచితూచి అడుగులు
అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై రాని స్పష్టత
ఈనాడు, అమరావతి: మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అధికార వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేసింది. మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో పెట్టే విషయంలో స్పష్టత రానట్లు తెలిసింది. రాజధాని అమరావతిపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, సీఆర్డీఏ అధికారులతో చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల అమలుకు ఉన్న అవకాశాలు, అమరావతిలో అభివృద్ధి ఎలా? దానికి ఎంత మేర ఖర్చు అవుతుందనే ప్రాథమికాంశాలపై చర్చించినట్లు సమాచారం. 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కోర్టు చెప్పిన కాల పరిమితిలోపు అభివృద్ధి చేయడం ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యం? హైకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించేటప్పుడు అందులో ఈ అంశాలనూ పొందుపరిస్తే ఎలా ఉంటుంది' అనే విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
ప్రజల ముందు పెడదాం...
'పాలనా వికేంద్రీకరణ అంశాన్ని ప్రజల ముందుంచాలి. గతంలో చెప్పినట్లే మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయాలనూ తీసుకుందాం' అని సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించాలా? వద్దా..? అనే అంశంపై ఆచితూచి ముందుకు వెళ్లాలన్న భావన సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. న్యాయ నిపుణులతో లోతుగా చర్చించిన తర్వాతే తదనంతర చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
5 కోట్ల మంది అభిప్రాయమూ తీసుకుంటాం: మంత్రి బొత్స సత్యనారాయ
ముఖ్యమంత్రితో సమావేశానంతరం అక్కడే మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ... 'మూడు రాజధానులపై రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలనూ తీసుకుంటాం. ఇప్పటికే తీసుకుంటున్నాం కూడా. ఎక్కడైనా ఒకరో ఇద్దరో మిగిలిపోతే వారి అభిప్రాయాన్నీ తీసుకుంటాం. రాజధాని అంటే ఒక వర్గం... ఒక ప్రాంతం... సామాజికవర్గమో...? రియల్ ఎస్టేట్ వ్యాపారులో కాదు. రాజధానికి ప్రజలందరి ఆమోదం కావాలి. వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు తగినట్లే పాలన ఉండాలి. ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు. మా ప్రభుత్వం చేస్తోంది. అధికార వికేంద్రీకరణకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం. సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానిదేనని పార్లమెంటే స్పష్టంగా చెప్పింది. అందువల్లే ఒక శాస్త్రీయ విధానంలో మూడు రాజధానులను మేం నిర్ణయించాం. దీనిపై కోర్టు తీర్పు చర్చనీయాంశం. మూడు రాజధానుల బిల్లులు సాధ్యమా? అసాధ్యమా అని కాదు... ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల బాగు, రాష్ట్రాభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు తప్పక విజయవంతం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి వికేంద్రీకరణ అవసరమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఏపీ రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీని నియమించారు. వికేంద్రీకరణను ఆ కమిటీనే సిఫార్సు చేసింది. కానీ... చంద్రబాబు హయాంలో దాన్ని ఎందుకు అమలు చేయలేదు. సమాన అభివృద్ధి కోసమే కదా హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఒకటికి మించి రాజధానులను ఏర్పాటు చేసింది' అని గుర్తుచేశారు.
రైతుల ప్లాట్లపై బొత్స స్పందిస్తూ: 'మూడు నెలల్లో ఏరకంగా ఇస్తారు. ప్రాక్టికల్‌గానే ఇది మాట్లాడుతున్నా తప్ప ఎవరినో కించపరిచేందుకు అనడం లేదు. సీఆర్డీఏ చట్టం అమలులోనే ఉంది. రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి... రహదారులను వేయాలన్నారు... అవి చేస్తున్నాం కదా? దాన్నించి మేం ఎక్కడా డీవియేట్ కాలేదు. రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వడమనేది సమయం, ఖర్చు, కావాల్సిన నిధులు అనే మూడు అంశాలతో ముడిపడి ఉంది. వాటిని పరిగణనలోకి తీసుకునే ఆలోచిస్తున్నాం, కోర్టు చెప్పినట్లు అఫిడవిట్‌నూ సమర్పిస్తాం' అని వివరించారు.
రైతులకు ఎందుకు క్షమాపణ చెప్పాలి?
రైతులకు ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలన్న జనసేన డిమాండ్‌పై విలేకరులు ప్రస్తావించగా మంత్రి బొత్స స్పందిస్తూ... 'రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. వాటిని అభివృద్ధి చేయాలి. రైతులకు కావాల్సింది ఆ రెండే. అవి మేం చేస్తున్నాం కదా? మరెందుకు సీఎం క్షమాపణ చెప్పాలి' అని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలోనే తనఖా
అమరావతిలో భూముల తనఖాపై విలేకరులు అడగ్గా... బొత్స స్పందిస్తూ 'రాజధానిలో రహదారులు, అభివృద్ధి కోసమే భూములను హడ్కోకు ఇచ్చారు. అవి కూడా చంద్రబాబు హయాంలో సంతకాలు చేసి ఇచ్చినవే. ఆయనే కదా అత్యధిక వడ్డీరేట్లపై బాండ్లు జారీ చేసింది. సమాజం కోసం కాకుండా సామాజికవర్గం కోసం, రియల్ఎస్టేట్ వ్యాపారుల కోసం చంద్రబాబు ఆ పనిచేశారు, కానీ... మా వైకాపా ప్రభుత్వం సమాజం కోసం, వ్యవస్థను బలోపేతం చేసేలా పనిచేస్తోంది' అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు పెడతారా అని విలేకరులు అడగ్గా..'చూద్దురు కానీ, ఎందుకు తొందరపడతారు' అని మంత్రి ముక్తాయించారు.
తీర్పును పరిశీలించాక స్పందిస్తాం: వెలంపల్లి
విజయవాడ (విద్యాధరపురం), న్యూస్‌టుడే: అమరావతిపై హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విజయవాడ పాతబస్తీలో విలేకరులతో గురువారం మంత్రి మాట్లాడుతూ.... 'రాజధాని ప్రాంత రైతులకే కాదు రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రియల్ ఎస్టేట్ పేరిట దందాలు, వ్యాపారం చేసే వారికి మాత్రం సహకరించబోదు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. గ్రాఫిక్స్ చూపించి వ్యాపారం చేయడాన్ని ప్రజలు గమనించినందునే జగన్‌ను గెలిపించారు' అని స్పష్టంచేశారు.
0 Comments:
Post a Comment